మళ్లీ.. రౌడీలొచ్చేశారు..!
నల్గొండ జిల్లాలో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థులు తిరిగి తమ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో రౌడీషీటర్లు భూ దందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంతో పోలిస్తే పెరిగిన కార్యకలాపాలు
ఈనాడు, నల్గొండ
నల్గొండ జిల్లాలో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థులు తిరిగి తమ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో రౌడీషీటర్లు భూ దందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా క్షేత్రస్థాయిలోని కొంత మంది అధికార పార్టీ నాయకులతో పాటూ పోలీసులతో ములాఖత్ అయి వ్యవహారాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఏడాది కాలంగా పోలీసింగ్‌లో నాణ్యత లోపించడం, ఎక్కడికక్కడ స్థానికంగా కొంత మంది అధికారులతో పాటూ ఏళ్లుగా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న నిఘా అధికారులు సైతం వీరి వెనుక ఉండటంతో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి.
మచ్చుకు కొన్ని..
* మిర్యాలగూడలో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. గతంలో హైదరాబాద్‌లో ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి గత కొన్ని రోజులుగా ఇక్కడ జరిగే పలు భూ దందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన్ను మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రాజకీయ జోక్యంతో వదిలేసినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు, ఇక్కడ పనిచేసే నిఘా అధికారి ఒకరు అతడికి తెరవెనుక సహకరిస్తున్నట్లు సమాచారం. ఈయన్ను కలవడానికి రాత్రి సమయాల్లో దిల్లీకి చెందిన వారు కొంత మంది నల్గొండ రహదారిలోని ఓ హోటల్‌లో కలవడానికి వస్తున్నట్లు గతంలోనే నిఘా వర్గాలు గుర్తించినా ఇప్పటికీ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు.
* సీసీఎస్ విభాగంలో ఏళ్లుగా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ జిల్లాలోని వివాదాస్పద భూముల వివరాలు సేకరించి ఓ పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి, ఓ రౌడీషీటర్ సహాయంతో దందాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే నల్గొండ పట్టణం సమీపంలో ఓ భూ దందా చేసి సుమారు రూ.46 లక్షలకు పైగా ఎదుటి వ్యక్తి నుంచి వసూలు చేయగా..నిఘా వర్గాలకు తెలిసినా ఉన్నతాధికారికి నివేదించలేదని సమాచారం.
* నల్గొండ నియోజకవర్గంలోని ఓ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ అధికారి అక్రమ దందాలు, భూ సెటిల్‌మెంట్లు, ఇసుక అక్రమ రవాణాతో ఇటీవలి కాలంలో బాగా కూడబెట్టినట్లు తెలిసింది. ఠాణాకు వెళ్లిన బాధితులపైనే ఆయన ఒత్తిడి చేసి కేసును ఉపసంహరించుకోవడమో లేదా బాధితుడిపైనే కేసు పెట్టడమో చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇటీవలే ఆయనపై ఉన్నతాధికారికి ఫిర్యాదులు వెళ్లగా.. ఒకట్రెండు రోజుల్లో ఆయనపై వేటు పడే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
* దేవరకొండలో కొంత మంది రౌడీషీటర్లకు తెరవెనుక అధికార పార్టీ నాయకులే అండదండలు అందిస్తున్నారు. నాలుగు నెలల కింద డిండి రహదారిలో 15 ఎకరాల ఓ భూ వివాదంలో సదరు యజమానిని ఓ రౌడీషీటర్ బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆయన అక్కడి ఉన్నతాధికారిని ఆశ్రయించగా...ఆయన సరైన రీతిలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. దీంతో సదరు యజమాని రెండు నెలల కింద ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా....పరిష్కారం లభించలేదని తెలిసింది.
వారిపైనే అనుమానాలు..?
భూముల ధరలు పెరగడంతో పాటూ ధరణి వెబ్‌సైట్ వచ్చిన అనంతరం వివాదాలు పెరగడంతో వివాదాస్పద భూములను కనిపెట్టి రౌడీషీటర్లను ముందుపెట్టి స్థానిక పోలీసు, నిఘా అధికారులే దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో తీవ్రమయ్యాయి. సుమారు 25 మందికిపైగా ఇన్స్‌పెక్టర్, ఎస్సై స్థాయి అధికారులు జిల్లాలోనే ఏళ్లుగా పనిచేస్తున్నారు. నిఘా విభాగంలోనూ ఏళ్లుగా ఒకే స్థానంలో పనిచేసేవారే ఉన్నారు. దీంతో వివాదం ఉన్న భూములు, దందాల్లో వీరికి సమాచారం రాగానే సదరు పాత నేరస్థుల సహాయంతో దందాలను పరిష్కరించి అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారని తెలిసింది.
నల్గొండ పట్టణంలో రాత్రి 12.30 గంటల నుంచి 3 గంటల వరకు సుమారు 30 ఏళ్లలోపున్న యువకుల బైక్‌లు రహదారులపై దూసుకుపోతున్నాయి. వీరంతా గంజాయిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పెట్రోలింగ్ వాహనంలో తిరిగే పోలీసులు ప్రధాన రహదారిపై సైరన్‌తో వెళుతుండటంతో బైక్‌లు ఆగిపోతాయి. పోలీసుల నిఘా కొరవడటంతోనే పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా ప్రస్తుతం గంజాయి దొరికే పరిస్థితి ఉంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
- అపూర్వరావు, ఎస్పీ, నల్గొండ
పాత నేరస్థులు, రౌడీషీటర్లపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నాం. వారి చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి రవాణా చేసేవారిపై పీడీ కేసులు పెడతాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/03/2023)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?