logo

పదహారేళ్లైనా పూర్తి కాలేదుగా..

నల్గొండ జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన ఎస్సెల్బీసీ సొరంగమార్గ పనులు 16 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.

Published : 04 Feb 2023 05:22 IST

దేవరకొండ, చందంపేట, న్యూస్‌టుడే

తెల్‌దేవరపల్లి గ్రామ సమీపంలో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న సొరంగమార్గం-2

నల్గొండ జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన ఎస్సెల్బీసీ సొరంగమార్గ పనులు 16 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం మిగులు జలాలను సొరంగమార్గం ద్వారా ఇక్కడికి తీసుకువచ్చి 3.50 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2005లో అప్పటి ప్రభుత్వం రూ.1925 కోట్ల వ్యయంతో రెండు జిల్లాల సరిహద్దులో సొరంగమార్గం పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులను  ఓ నిర్మాణ సంస్థ టెండరు దక్కించుకుంది. చందంపేట మండల తెల్‌దేవరపల్లి గ్రామ సమీపంలో 7.25 కిలోమీటర్ల సొరంగమార్గం-2 తవ్వకాల పనులను ఉప గుత్తేదారుగా మరో కంపెనీకి రూ.131 కోట్ల వ్యయంతో అప్పగించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో సొరంగమార్గం పనులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రాజెక్టు స్వరూపం ఇలా..

* శ్రీశైలం మిగులు జలాలు 7.25 టీఎంసీలను నక్కలగండి వద్ద చేపడుతున్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నిల్వ చేయాలి.
* రిజర్వాయర్‌ నుంచి నక్కలగండి సొరంగమార్గం-2 ద్వారా పెండ్లిపాకల ప్రాజెక్టుకు తరలించి, అక్కడి నుంచి ఏకేబీఆర్‌ ప్రాజెక్టుకు మళ్లించాలి.
* 2005లో రూ.1925 కోట్లకు రూపకల్పన చేయగా.. ప్రస్తుతం రూ.4వేల కోట్లకు పెంచారు.
* 43.75 కి.మీకు 9 కి.మీ సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది.

కొత్త ఉప గుత్తేదారులకు పనులు అప్పగింత

16 ఏళ్ల విరామం తర్వాత సొరంగమార్గం-2 కాంక్రీట్‌ పనులకు ఓ నిర్మాణ సంస్థ నిర్వాహకులకు ప్రధాన నిర్మాణ సంస్థ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు 3 కి.మీ కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉంది. వీటిని చేపట్టేందుకు ఈ నెల 1న తెల్‌దేవరపల్లి గ్రామ సమీపంలోని సొరంగమార్గానికి వివిధ వాహనాలను తరలించారు.


2023 డిసెంబరు నాటికి కాంక్రీటు పనులు పూర్తి

- చక్రపాణి, నీటిపారుదలశాఖ డీఈ

ఏళ్ల తరబడిగా నిలిచిపోయిన కాంక్రీటు పనులు పూర్తి చేసేందుకు సన్‌బీమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ నిర్వాహకులు 2023 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు పనులు ప్రారంభించారు. పాత ఉప గుత్తేదారులకు బకాయి వ్యవహారంలో పనులు నిలిపివేసినట్లు తెలుస్తుంది. పనులు నిలిపివేయకుండా చర్యలు చేపడుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని