logo

సాంకేతిక తెరలో.. పోషకాల నావ

అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహారం, ఇతర సరకులు పక్క దారి పడుతున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటిని నివారించేందుకు ప్రభుత్వం ‘న్యూట్రిషన్‌, హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’ (ఎన్‌హెచ్‌టీఎస్‌) యాప్‌ను తీసుకొచ్చింది.

Published : 09 Feb 2023 03:22 IST

యాప్‌లో అంగన్‌వాడీల సమాచారం నిక్షిప్తం
మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహారం, ఇతర సరకులు పక్క దారి పడుతున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటిని నివారించేందుకు ప్రభుత్వం ‘న్యూట్రిషన్‌, హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’ (ఎన్‌హెచ్‌టీఎస్‌) యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను నాలుగేళ్ల క్రితమే ప్రవేశపెట్టినప్పటికీ.. సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు యాప్‌ను ఆధునీకరించి ఇటీవలే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. అంగన్‌వాడీ సిబ్బంది గతంలో మాన్యువల్‌గా నమోదు చేసే రికార్డులన్నీ ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. యాప్‌ను తీసుకురావడం వల్ల అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడమే కాకుండా కేంద్రంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.

నిత్యం నమోదు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాల పంపిణీ నుంచి నిల్వల వరకు సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేసేలా ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీంట్లో ప్రతి రోజు లబ్ధిదారులు ఎంత మంది హాజరయ్యారు, ఎంత మందికి పౌష్టికాహారం, భోజనం పంపిణీ చేశారో నిత్యం నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా కేంద్రానికి ఎంత ఆహారం వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు..ఇంకెంత మిగిలింది.. అంశాలను పై అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది. చిన్నారుల పోషణ స్థితిని నమోదు చేస్తూ.. వారికి తగిన సలహాలు ఇచ్చే సదుపాయం ఉంది. దీంతో పాటే నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియ, కేంద్రానికి సంబంధించిన భవనం, ఇతర వివరాలు ఈ యాప్‌లో నమోదు చేసే అవకాశం ఉంది.

సిబ్బందికి తగ్గిన ఒత్తిడి..

గతంలో అంగన్‌వాడీ సిబ్బంది పద్నాలుగు రిజిస్టర్లలో పలు వివరాలు నమోదు చేయాల్సి ఉండేది. దీని ద్వారా ఒత్తిడి పెరిగి.. లబ్ధిదారులతో మమేకం అయ్యే అవకాశం తక్కువగా ఉండేది. ఈ యాప్‌ ద్వారా అన్ని వివరాలు సులభంగా నమోదు చేయడంతో పాటు వాటిని ప్రింట్‌ తీసుకునే సదుపాయం సైతం ఉంది. దీంతో సిబ్బందికి సమయాభావం తగ్గి.. పిల్లలు, గర్భిణులతో ఎక్కువ సేపు మమేకం అయ్యే అవకాశం ఏర్పడింది. సూపర్‌వైజర్లు, సీడీపీవోలతో పాటు జిల్లా, రాష్ట్ర అధికారులు సైతం ఏ కేంద్రం సమాచారాన్నైనా సులభంగా వారున్న చోటు నుంచే పరిశీలించి తగిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా యాప్‌ రూపొందించారు.


సేవల్లో పారదర్శకత కోసమే..

సుభద్ర, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి, నల్గొండ.

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవల్లో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. వివరాలన్నీ యాప్‌లోనే పొందు పరచనున్నందున మాన్యువల్‌ రికార్డులతో పని లేకుండా అవకతవకలను నివారించే వీలు కలుగుతుంది. ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ అందించాం.అన్ని వివరాలు సమగ్రంగా నిక్షిప్తం చేయడం వల్ల పోషకాహార లోపాన్ని సైతం నివారించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని