logo

యశస్వి.. భవితకు దిక్సూచి

పాఠశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాయి. తాజాగా ప్రగతి పత్రాలను కూడా అందుకున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

Published : 27 Apr 2023 03:44 IST

ప్రతిభ చూపితే ఉపకారవేతనం..
ఎనిమిదో తరగతి పూర్తిచేసిన వారికి అవకాశం

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాయి. తాజాగా ప్రగతి పత్రాలను కూడా అందుకున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సెలవుల్లో చదువుకు సానబెట్టి ప్రతిభ చూపి ఉపకార వేతనం పొంది ఆర్థిక అవసరం తీర్చుకునే మంచి తరుణం ఇది. ‘పీఎం యశస్వి’ ఉపకార వేతన పథకం పేర కేంద్ర సర్కారు గతేడాదే రూపకల్పన చేసింది. యశస్వి అంటే ‘యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డు స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా’. ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద ఉపకార వేతన పథకాల్లో ఇది కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ పథకం నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1100 ఉన్నత పాఠశాలలుంటే ఎనిమిది, తొమ్మిది, పదోతరగతిని ఇటీవలనే పూర్తి చేసుకున్నవారు సుమారు 82,273 మంది విద్యార్థులున్నారు.

అర్హులు ఎవరంటే..?

విద్యార్థి భారతీయుడై ఉండి, కేంద్ర విద్యాశాఖ అధికారిక ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో నిర్వహించే యశస్వి ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎనిమిదో తరగతి పూర్తయి ఉండాలి. 9, 10 తరగతులు పూర్తయినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి మిగిలిన సంవత్సరాలకు (ఇంటర్‌ వరకు) మాత్రమే ఉపకార వేతనం లభిస్తుంది. సదరు విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించొద్దు. గ్రామాల్లోని నిరుపేదలు, రైతులు, అణగారిన కుటుంబాల్లోని విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తు ఇలా చేయాలి...

ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పేరు నమోదు కావాలి. పేరు, ఈ- మెయిల్‌ అడ్రస్‌, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ తదితరాలతో ఓ ఖాతాను క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత దరఖాస్తుదారుడికి అప్లికేషన్‌ నంబర్‌ వస్తుంది. అదే వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి. చదువు, గుర్తింపుకార్డు తదితర వివరాల డాక్యుమెంట్ల సాఫ్ట్‌కాపీలను అప్‌లోడ్‌ చేసి సైన్‌అప్‌ కావాలి. అంతటితో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. పరీక్ష, ప్రవేశకార్డు జారీచేసే తేదీ తదితర వివరాలను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష ఈ విధంగా..

ఎంపిక చేసిన కేంద్రాల్లో మూడు గంటలపాటు కొనసాగే పరీక్షలను హిందీ, ఇంగ్లిషు భాషల్లో నిర్వహిస్తారు. ఎలాంటి పరీక్ష రుసుం ఉండదు. పత్రంలో వంద బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. గణితంలో 120 మార్కుల కోసం 30 ప్రశ్నలు, సైన్స్‌లో 80 మార్కులకు 20 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌లో 100 మార్కులకు మరో 25 ప్రశ్నలుంటాయి. దేశ వ్యాప్తంగా సుమారు 78 నగరాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. గతేడాది సెప్టెంబరు 11న పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 15 నుంచి ఈ ఏడాది నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 26తో దరఖాస్తు గడువు పూర్తి కానుంది.

అర్హత సాధించిన అనంతరం..

9, 10 తరగతులకు ఏటా రూ.75 వేలు, ఇంటర్మీడియట్‌ లేదా 11, 12 తరగతులకు ఏటా రూ.1.25 లక్షలు ఉపకార వేతనం ఒకేసారి సంబంధిత ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు ఎంపికైన విద్యార్థులు ఉపకార వేతనం కోసం తిరిగి అదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాంకు ద్వారా పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకు పాసుపుస్తకం ఫొటోకాపీని జతచేయాలి. ఉపకారవేతనం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటితో కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ పాఠశాల, కళాశాలలో అయినా విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చు. ఆ పాఠశాలల వివరాల లింకు కూడా ఆ వెబ్‌సైట్‌లో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని