logo

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో స్లీపర్‌ క్లాస్‌ బోగీల కుదింపు

సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిరుపేదలకు, కూలీలకు అనుకూలంగా ఉండే రైలు.

Updated : 04 Jul 2023 03:36 IST

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు

సామాన్య ప్రయాణికులపై మూడొంతుల భారం మిర్యాలగూడ, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిరుపేదలకు, కూలీలకు అనుకూలంగా ఉండే రైలు.  స్లీపర్‌ క్లాస్‌ బోగీలను కుదించడం వాటి స్థానంలో ఏసీ బోగీలను పెంచడంతో  సామాన్య ప్రయాణికులపై మూడొంతుల భారం పడుతోంది. మొదట్లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖ పట్టణం వరకు మాత్రమే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు 17015, 17016 నెంబర్లపై నడిచేది. ఆ తరువాత కొంతకాలానికి  భువనేశ్వర్‌ వరకు పొడిగించారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఉపాధి కోసం వచ్చే ఒడిశా కూలీలకు ఈ రైలు ఎంతో అనుకూలంగా ఉంది. గతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 11 స్లీపర్‌ క్లాస్‌ , మూడోతరగతి ఏసీ బోగీలు మూడు, రెండోతరగతి  ఏసీ బోగీలు రెండు, నాలుగు జనరల్‌ బోగీలు, దివ్యాంగుల బోగీ, మహిళల ప్రత్యేక బోగీలు ఉండేవి. ఈఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఎల్‌హెచ్‌బీ ( లింక్‌ ఆఫ్‌మన్‌ బుష్‌) బోగీలు ప్రారంభించారు. ప్రయాణ సమయం తగ్గించడంతో పాటుగా వేగం పెంచేలా వీటిని ఏర్పాటు చేశారు. ఎల్‌హెచ్‌బీ బోగీల మార్పు తరువాత ప్రస్తుతం విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 3 స్లీపర్‌ క్లాస్‌, 10 మూడోతరగతి ఏసీ బోగీలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌ రూ.525 కాగా మూడోతరగతి ఏసీ రూ.1405  ఉండగా స్లీపర్‌ క్లాస్‌ లభించని వారు మూడోతరగతి ఏసీ బుకింగ్‌ చేసుకోవాల్సి వస్తుండగా ఒక్కొక్కరిపై మూడొంతుల భారం పడుతుంది.

* ప్రధానంగా ఒడిశా నుంచి నిత్యం ఐదువందల మందికి పైగా కార్మికులు తెలంగాణ, ఏపీలోని ఆయా ప్రధాన నగరాలకు హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, విశాఖ పట్టణం, మిర్యాలగూడ)  ఉపాధికోసం వస్తున్నారు. రెండునెలలు పనిచేసి తిరిగి వెళ్లటం, మరో రెండునెలల విశ్రాంతి తరువాత తిరిగి పనులకు వస్తుంటారు. అందుకే విశాఖ, ఫలక్‌నుమా రైళ్లలో ఎక్కువ మంది ఒడిశా కార్మికులు నిత్యం ప్రయాణిస్తుంటారు. వీరంతా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బడుగుల రైలును ధనికులకు అనుకూలంగా రైల్వేశాఖ అధికారులు మార్చిన   తీరుపై నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్లీపర్‌ క్లాస్‌ బోగీలను పెంచి నిరుపేద, మద్యతరగతి ప్రజలపై భారం తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని