logo

విసుగు చెందేలా.. వింత శబ్దాలు

నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక వింత శబ్దంతో చిరాకు తప్పడం లేదు. మైకుల మోత, రాజయ నాయకుల ఊరేగింపులు, కూరగాయల నుంచి పాతసామాన్లు కొనేవారు, ఐస్‌క్రీమ్‌ బండ్లవారు, మున్సిపల్‌ చెత్తసేకరణ కోసం వాడే మైకులు, డీజే శబ్దాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

Updated : 12 Aug 2023 06:14 IST

నీలగిరి, న్యూస్‌టుడే:  నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక వింత శబ్దంతో చిరాకు తప్పడం లేదు. మైకుల మోత, రాజయ నాయకుల ఊరేగింపులు, కూరగాయల నుంచి పాతసామాన్లు కొనేవారు, ఐస్‌క్రీమ్‌ బండ్లవారు, మున్సిపల్‌ చెత్తసేకరణ కోసం వాడే మైకులు, డీజే శబ్దాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇక కొందరు ఆకతాయిలు తమ వాహనం సైలెన్సర్‌, హారన్‌ మార్చి రయ్‌ మంటూ దూసుకెళ్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. వింత శబ్దాలు చేస్తున్న వాహన దారులపై పోలీసులు కేసులు నమోదు, జరిమానాలు విధించినా.. వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. మానవుడు సాధారణంగా 90 డెసిబుల్స్‌ లోపు శబ్దం వింటే ఏ సమస్య ఉండదు. కానీ.. అంతకు మించి తరచూ వింటే వినికిడి సమస్యతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పోలీసులు పట్టుకున్నా ..

వింత శబ్దాలతో వాహనాలు నడిపేవారిని తనిఖీలలో  పోలీసులు పట్టుకుని జరిమానా విధిస్తున్నారు. వారిలో మార్పు రాకుండా రెండో సారి కూడా దొరికిపోతే కుటుంబ సభ్యులను పిలిచి హెచ్చరిస్తున్నారు. అయినా.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వాహనాల నుంచి వచ్చే శబ్దం విపరీతంగా ఉండొద్దని నిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారు  వింత శబ్దాలు వింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు ïాచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఆనందం కోసం వాహనాలకు వింత శబ్దం ఏర్పాటు చేసుకునేవారు ఇతరుల ఆరోగ్యం గురించి ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం.. సురేశ్‌రెడ్డి, ఆర్టీవో

వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో అవగాహన కల్పిస్తున్నాం. సంస్థ నుంచి ఏర్పాటు చేసిన విధంగా సైలెన్సర్‌, హారన్‌ ఉండాలని.. వాటిని ఎలాంటి మార్పులు చేసినా చట్టపరంగా రూ.2వేల జరిమానా విధిస్తాం. రెండో సారి కూడా అలాగే వ్యవహరిస్తే వారిని పోలీసులు అప్పగిస్తే ఆ వాహనాన్ని సీజ్‌ చేస్తాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు...

నాగదుర్గాప్రసాద్‌, సీఐ, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌, నల్గొండ

ఇంత శబ్దాలు వచ్చేలా రెండు హారన్లు, సైలెన్సర్‌ మార్చితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. డీజేలకు అనుమతి లేదు, వ్యాపారులు మైక్‌ల సౌండ్‌ తగ్గించి అమ్ముకోవాలి. శబ్ద కాలుష్యానికి కారణమైన వారిపై జరిమానా విధిస్తున్నాం.

90 డెసిబుల్స్‌ దాటితే వినికిడి కోల్పోతారు

 డాక్టర్‌ ఇమ్మానియల్‌, చెవి ముక్కు గొంతు స్పెషలిస్టు

వింత శబ్దాలు నిరంతరం వింటే వినికిడి శక్తిని కోల్పోయి మానసిక సమస్యలు వస్తాయి. 90 డెసిబుల్స్‌కు మించి శబ్దం వినొద్దు. చిన్నపిల్లలు పాఠశాల బస్సు హారన్‌ శబ్దం ఎక్కువ సేపు విన్నా ఇబ్బంది పడతారు. ఇయర్‌ పోన్లు నిరంతరం వాడితే వినికిడి సమస్య వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని