logo

సైబర్‌ బాధితులకు వారియర్స్‌ తోడు

చరవాణుల ద్వారా డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు.

Updated : 19 Apr 2024 06:27 IST

జిల్లాలో 26 మంది నియామకం

సూర్యాపేటలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

 ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట: చరవాణుల ద్వారా డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. వివిధ రకాల ఆఫర్లు, ప్రలోభాల పేరిట ఎర వేస్తున్న నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. వీరి ఆగడాలను నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సదస్సులు, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో బాధితులకు మరిన్ని సేవలందించేందుకు సైబర్‌ వారియర్స్‌ పేరిట సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చింది.

 వారియర్‌ సేవలు ఇలా..

సైబర్‌ నేరాల బారిన పడిన బాధితులు టోల్‌ ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేస్తున్నారు. ఘటన చోటుచేసుకున్నాక ఎంత త్వరగా సమాచారం ఇవ్వగలిగితే అంత వేగంగా నేరాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. నేరాలు పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బాధితులు టోల్‌ ఫ్రీ నంబరును ఆశ్రయిస్తున్నారు. అక్కడ కాల్స్‌ ఎక్కువ కావడంతో అక్కడ సహాయ కేంద్రాల సంఖ్యను పెంచారు. అయినా విపరీతమైన ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో బాధితులకు సత్వరం, మేలైన సేవలు అందించేందుకు ఎంపిక చేసిన పోలీస్‌ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌ వారియర్స్‌ సిద్ధం చేశారు. సైబర్‌ నేరాలకు సంబంధించి ఎలాంటి కేసులున్నా..ఈ వారియర్స్‌ను సంప్రదిస్తే వారు ఎన్‌సీఆర్పీ(నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌)లో వివరాలు నమోదు చేస్తారు. ఇప్పటికే నమోదైన కేసుల ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తారు. ఎవరైనా 1930కు కాల్‌ చేస్తే.. బాధితుల సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల సైబర్‌ వారియర్స్‌కు సమాచారం చేరుతుంది. వారే బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని లేదా ఫోన్‌లోనే మాట్లాడి సహాయం అందిస్తారు.

ఠాణాకో ఫోన్‌నంబరు

ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక సైబర్‌ వారియర్‌ను నియమించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వివిధ రకాల పోలీస్‌స్టేషన్లు 26 ఉన్నాయి. వాటి పరిధిలో సైబర్‌ విభాగంలో అవగాహన కలిగిన సిబ్బందికి హైదరాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే అవసరమైన శిక్షణ అందించారు. అందరికీ ప్రత్యేకంగా సిమ్‌కార్డులు, ఫోన్‌ అందించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా ఆ నంబర్లు అందరికీ తెలిసేలా ప్రచారం చేపట్టనున్నారు.


ప్రజలు వినియోగించుకోవాపజలు వినియోగించుకోవాలి
- రాహుల్‌ హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట

సైబర్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకే జిల్లాలో సైబర్‌ వారియర్స్‌ను నియమించాం. ప్రజలు సైబర్‌ మోసాలపై అవగాహన పెంచుకోవాలి. బాధితులు వారియర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని