logo

విభజన హామీల అమలుకు కృషి

భువనగిరి లోక్‌సభ  ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 25 Apr 2024 02:53 IST

చామల  కిరణ్‌కుమార్‌రెడ్డి

నామినేషన్‌ అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్‌, ఎమ్మెల్యేలు వీరేశం, అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే మందుల సామేల్‌

భువనగిరి, న్యూస్‌టుడే: భువనగిరి లోక్‌సభ  ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి హన్మంత్‌ కే.జెండగేకు తన నామపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. ప్రధానంగా జిల్లాలను పట్టిపీడిస్తున్న మూసీ కాలుష్య ప్రక్షాళనకు నిధుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాన్నారు. గంధమళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు కృషి చేయడంతో పాటు బస్వాపూర్‌ జలాశయం పనులు వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీలోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం శ్రీలక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి చెబితే భాజపా, కాంగ్రెస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌పై కుట్రపూరిత విమర్శలు, ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ తాను మంజూరు చేయించాని భాజపా అభ్యర్థి నర్సయ్య గొప్పలు చెప్పుకుంటున్నారని, అక్కడ నిమ్స్‌ ఏర్పాటు చేసింది దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ అని, అక్కడ భవనాలు నిర్మించకుంటే ఎయిమ్స్‌ వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ సర్కార్‌ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. భారాస రాష్ట్రంలో ఎక్కడా లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్‌, సామ మధుసూదన్‌రెడ్డి, పోత్నక్‌ ప్రమోదక్‌కుమార్‌, పంజాల రామాంజనేయులు గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, బీసుకుంట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని