logo

తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!

స్కానింగ్‌ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్‌ ల్యాబ్‌ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్‌ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి.

Updated : 30 Apr 2024 06:25 IST

భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్కానింగ్‌ కోసం బారులు తీరిన గర్భిణులు

భువనగిరి, భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: స్కానింగ్‌ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్‌ ల్యాబ్‌ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్‌ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. నెలకు భారీగా వేతనాలు తీసుకుంటున్నా.. ప్రైవేట్‌లో ప్రాక్టీస్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. స్కానింగ్‌ కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చే గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతి రోజు సుమారుగా 100 మంది వరకు గర్భిణులు పరీక్షల కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తుంటారు. స్పెషలిస్టుల సూచనల మేరకు నెలనెలా స్కానింగ్‌ చేసి గర్భంలోని శిశు పరిస్థితి గమనిస్తారు. సదరు ఉద్యోగి ఇక్కడ కొంత మందిని పరీక్షించిన తరువాత మధ్యలో బయటకు వెళ్తున్నట్లు సమాచారం. మిగిలిన వారిని ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు వస్తే అక్కడ స్కానింగ్‌ చేస్తానని బహిరంగంగానే చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అక్కడ రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. నిరీక్షించే ఓపిక లేక సిబ్బందిని అడిగితే డాక్టర్‌ ఎదురుగా ఉన్న ల్యాబ్‌లో ఉంటారు. అక్కడకు వెళ్లాలని సూచిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు గంటల తరబడి నిరీక్షించి స్టాఫ్‌ నర్స్‌తో గొడవకు దిగారు. ఈ విషయాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీశైల చిన్నానాయక్‌ దృష్టికి తేగా ఇప్పటి వరకు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రస్తుతానికి రేడియాలజిస్టు ఒక్కరే విధులు నిర్వరిస్తున్నారని, రోజుకు వందకు పైగా స్కానింగ్‌లు జరుగుతున్నాయని ‘న్యూస్‌టుడే’కు వివరణ ఇచ్చారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 

డాక్టర్‌ లేకపోవడంతో ఖాళీగా కనిపిస్తున్న స్కానింగ్‌ రూం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని