logo

పోలీసుల అదుపులో గంజాయి విక్రేతలు

నార్కట్‌పల్లి పోలీసు ఠాణాలో గంజాయి అమ్మకాలతో పాటు సేవిస్తున్న అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Published : 01 May 2024 06:05 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నార్కట్‌పల్లి పోలీసు ఠాణాలో గంజాయి అమ్మకాలతో పాటు సేవిస్తున్న అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నార్కట్‌పల్లిలోని ప్రధాన రహదారిలో మూడు రోజుల క్రితం ఓ యువకుడు గంజాయి సేవించి కామినేని వైద్య విద్యార్థులతో గొడవ పడగా.. ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని విచారించగా.. విక్రయించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. యువకులు నార్కట్‌పల్లితో పాటు, కట్టంగూర్‌, రామన్నపేటకు చెందిన వారిగా సమాచారం. రెండ్రోజుల్లో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.


కారు ఢీకొని పలువురికి గాయాలు

 నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం సమీపంలోని చర్లపల్లి ప్రాంతంలో కారు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. చర్లపల్లికి చెందిన పిన్నపురెడ్డి లక్ష్మి, పిన్నపురెడ్డి పద్మతో పాటు మరో ఇద్దరు మంగళవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి నల్గొండ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. వీరి ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఫార్మసీ కళాశాల ముగ్గురు విద్యార్థులనూ ఢీకొట్టడంతో వారికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


6785 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయింపు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని 466061 ఆహార భద్రతా కార్డులకు సంబంధించి మే నెలకు 6785.396 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు డీఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. కార్డుదారులు చౌకధర దుకాణాలకు వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి లబ్ధిదారునికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుదారునికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారునికి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.


వడదెబ్బతో యువకుడి మృతి..

శాలిగౌరారం: మండలంలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన మేతరి అనిల్‌కుమార్‌(32) వడదెబ్బతో మంగళవారం నల్గొండ ఆసుపత్రిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అతడు కొంతకాలంగా గ్రామంలో ఫాస్టు ఫుడ్‌ సెంటర్‌ను కొనసాగిస్తున్నాడు. రెండు రోజుల కింద ఎండ తీవ్రతతో పాటు, వంట వేడి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని