logo

ఎవరికి ‘మూడు’ద్దో

నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్‌సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు.

Updated : 03 May 2024 05:39 IST

భువనగిరి, న్యూస్‌టుడే: నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్‌సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. 2024 ఎన్నికల్లో భువనగిరి స్థానానికి అత్యధికంగా 61 మంది నామినేషన్లు వేయడంతో ఒక దశలో అధికారులు గాబరాపడ్డారు. నామపత్రాల పరిశీలనలోనే 10 మందివి తిరస్కరించగా, ఉపసంహరణ చివరి రోజున 12 మంది పోటీ నుంచి విరమించుకున్నారు. దీంతో చివరకు 39 మంది బరిలో ఉన్నారు.

  • నియోజకవర్గం ఏర్పడిన 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో 14 మంది పోటీ చేశారు. అప్పుడు పోటీ కాంగ్రెస్‌, మహాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్య మధ్య జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. భాజపా అభ్యర్థికి ధరావతు దక్కలేదు. పీఆర్పీ అభ్యర్థి చంద్రమౌళిగౌడ్‌కు మాత్రం 1,04,872 ఓట్లు వచ్చాయి.
  • ఇక 2014 ఎన్నికల్లో 13 మంది మాత్రమే పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌, భారాసల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో భారాస అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ తొలిసారి గెలిచారు. తెదేపాతో మద్దతుతో  పోటీచేసిన భాజపా అభ్యర్థి మూడో స్థానంలో నిలిచి డిపాజిట్‌ దక్కించుకున్నారు. 2019లోనూ 13 మంది మాత్రమే పోటీలో ఉన్నా కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలిచారు. కాగా ఈసారి జరుతున్న ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు.
  • ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్‌, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన వారు కూడా పోటీలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్రులు అధికంగానే పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడపుడుతోంది. 39 మంది పోటీలో ఉండటంతో పాటు నోటా కూడా గుర్తు కేటాయించడంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో మూడు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. గతంలో మూడు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒకే బ్యాలెట్‌ యూనిట్‌తో సరిపోయింది. ఇప్పుడు ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో మూడు యూనిట్లు అవసరం పడుతున్నాయి.
  • తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు ఏ యూనిట్లో  తెలుసుకోవడంలో ఓటర్లు తికమక చెందే అవకాశం ఉంది. వారు అయోమయంలో ఎటు ఓటేస్తారోనని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2019లోనే రోడ్‌ రోలర్‌ గుర్తు , కారు గుర్తు ఒకే పోలిక ఉండటంతో భారాసపై పోటీ చేసిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఓటమికి కారణమైంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న గుర్తులు ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు.
  • భువనగిరి లోక్‌సభ స్థానంలో 2,141 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కన పోలింగ్‌ కేంద్రానికి మూడు చొప్పున 6,423 బ్యాలెట్‌ యూనిట్లు అవసరం పడతాయి. రిజర్వులో 20 శాతం ఉంచుతారు. అవసరమైన బ్యాలెట్‌ యూనిట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమకూర్చుతుందని కలెక్టర్‌ హన్మంత్‌ కే.జెండగే ‘న్యూస్‌టుడే’కు చెప్పారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని