logo

నేనేంటీ.. నాకింత విలువేంటి..!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

Published : 05 May 2024 04:30 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. ఇంటింటి ప్రచారం, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తూనే.. మరోవైపు రోజుకో చోట ఏదో ఒక పార్టీ వారిని తమ పార్టీలో చేర్చుకుంటూ తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో కొన్ని రోజులుగా చేరికలు ఊపందుకున్నాయి. వాస్తవానికి ఈ చేరికలు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కొనసాగుతున్నాయి. పార్టీలో చేరుతున్న వ్యక్తికి అంతకు ముందు పార్టీలో సభ్యత్వం ఉందా.. అతడు కార్యసాధకుడేనా.. ఇవేమీ అవసరం లేకుండా సామాన్య ఓటరైనా ఫ£ర్వాలేదు.. చేరికల సంఖ్య భారీగా ఉండాలనే తపన ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి కొత్తగా కండువా భుజాన పడగానే నాకింత విలువుందా అని సంబరపడుతున్నారు.

స్థాయికి మించి డిమాండ్‌

ఆయా పార్టీల్లో చేరుతున్న వారంతా సంబంధిత పార్టీలపై ఉన్న అభిమానం, అభ్యర్థిపై ఉన్న మమకారంతో చేరుతున్నారనుకుంటే పొరపడినట్లే. పార్టీలో చేరడానికి ముందే నాయకులకు బేరసారాలతో దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతుండగా.. మరికొందరు స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ప్రోద్బలంతో ఆయా పార్టీల్లో చేరుతున్నారు. కొందరు స్థాయికి మించి డబ్బు డిమాండ్‌ చేస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వారికిచ్చే మొత్తాలు ప్రచార వ్యయాన్ని మించిపోతుండటంతో కొందరు నాయకులు వేచి చూసే ధోరణి అవలంబిస్తుండగా.. మరి కొందరు ఏదో ఒక హామీ ఇస్తూ కండువాలు కప్పుతున్నారు. చివరికి కండువాలు కప్పుకున్న వారంతా ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు లేవు. నాయకులు వచ్చినప్పుడు మాత్రమే దర్శనమిస్తూ ఆ తర్వాత కనుమరుగవుతున్నారు.

గుర్తింపు కార్డు లేకపోయినా..

వాస్తవానికి ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరుతున్నారంటే వారి వద్ద అదివరకు పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలి. తాజాగా పార్టీలు మారుతున్న వారిలో 10 శాతం మందికి కూడా ఈ కార్డులు లేవు. కనీసం ఆ పార్టీలో ఎటువంటి పదవులు అనుభవించకపోయినా.. తాము సీనియర్‌ నాయకులమంటూ ఏ పార్టీలో గుర్తింపు కార్డు లేని వారిని తమ అనుచరులుగా చూపించి సామాన్య ఓటర్లకు సైతం సామూహికంగా కండువాలు కప్పేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని