logo

అప్రమత్తతే శ్రీరామరక్ష

మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 05 May 2024 04:39 IST

సరైన రక్షణ కవచాలు లేకుండా ప్రమాదకరంగా పని చేస్తున్న కార్మికుడు

కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏప్రిల్‌ 27న కొండమల్లేపల్లిలోని ఓ సామిల్‌ (కట్టెల మిల్లు)లో జరిగిన విద్యుదాఘాతంతో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 16.72 లక్షల విద్యుత్తు వినియోగదారులున్నారు. తరచూ ఎక్కడో ఓ చోట విద్యుత్తు ప్రమాదం జరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యుత్తు అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా నియంత్రికలను సొంతంగా బంద్‌ చేయడం, స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేసుకోవడం, నియంత్రికల చుట్టూ కంచె లేకపోవడం, ఇళ్లలో ఎర్తు వస్తున్నా.. పట్టించుకోకపోవడం తదితర కారణాల వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.  

అధికారుల సూచనలు

  • విద్యుత్తు లైన్ల కింద పందిర్లు, జెండాలు కట్టొద్దు.
  • ఐఎస్‌ఐ లేదా ప్రముఖ కంపెనీలకు చెందిన విద్యుత్తు తీగలు, పరికరాలు, పంపులు మాత్రమే వినియోగించాలి. ధర తక్కువ, నాణ్యత, గుర్తింపు లేని వాటిని వినియోగించకూడదు.
  • నియంత్రికల ఫ్యూజ్‌లను విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వకుండా, అనధికారికంగా మార్చొద్దు.
  • సర్వీస్‌ వైర్లు, విద్యుత్తు వీధి దీపాలను సరి చేసేందుకు ఇతరులు విద్యుత్తు స్తంభాలను ఎక్కకూడదు.
  • ఇళ్లలో, కార్యాలయాల్లో తప్పని సరిగా ఎర్తు ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇంటి ఆవరణలో విద్యుత్తు వైర్లకు సమీపంలో జి.ఐ, ఇనుప తీగలతో కూడిన దండేలు కట్టి వాటిపై తడి దుస్తులు ఆరవేయొద్దు.
  • ఏవైనా వస్తువులు విద్యుత్తు తీగలకు చుట్టుకుంటే వాటిని తీసే ప్రయత్నం చేయకూడదు.

అవగాహన కల్పిస్తున్నాం

చంద్రమోహన్‌, ఎస్‌ఈ, నల్గొండ

విద్యుత్తు మరమ్మతుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అధికారులు, సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తున్నాం. అవగాహన లేని వారు స్వతహాగా విద్యుత్‌ మరమ్మతులు చేసుకోవద్దని సూచిస్తున్నాం.

జిల్లా వినియోగదారుల సంఖ్య

నల్గొండ 7,22,404
సూర్యాపేట 5,26,087
యాదాద్రి 4,24,061

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని