logo

మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 05 May 2024 04:41 IST

రహదారి విస్తరణలో భాగంగా మిర్యాలగూడలో నరికేసిన భారీ చెట్లు (పాత చిత్రం)

మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ప్రజలు అనుభవించని ఎండలను ఈ వేసవిలో చవిచూస్తున్నారు. రికార్డు స్థాయిలో అనేక ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో..  ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు, వడ గాలులతో అనేక మంది ప్రాణాలు సైతం విడుస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాదే ఎందుకు ఎండలు మండిపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

మితిమీరిన కాలుష్యం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలసిన వివిధ పరిశ్రమల కారణంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్యం కారణంగా కార్బన్‌ డయాక్సైడ్‌, మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి వాయువులు వాతావరణంలో పెరిగిపోవడంతో భూమి వేడెక్కిపోతోంది. గత కొన్నేళ్లుగా ఏటా వాతావరణంలో ఈ వాయువుల ప్రభావం భారీగా పెరుగుతూ వస్తుంది. దీంతో ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మట్టి రహదారులు కనుమరుగు..

అభివృద్ధి పేరుతో గ్రామాల్లో సైతం మట్టి రహదారులు లేకుండా మొత్తం సీసీ రహదారులు ఏర్పాటు చేయడంతో వేడి పెరిగేందుకు ప్రధాన కారణంగా మారుతుంది. దీని వల్ల వర్షపు నీరు, ఇళ్లలో వాడే నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాలువల ద్వారా దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. దీనికి తోడు నీటి కోసం ఎడాపెడా బోర్లు తవ్వుతుండడంతో భూగర్భ జలాలు భారీగా పడిపోయి.. వేడి పెరిగేందుకు కారణం అవుతోంది.

ఎడాపెడా చెట్ల నరికివేత..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ భారీ రహదారులు ఇటీవల కాలంలో అనేకం వచ్చాయి. వీటి నిర్మాణానికి, రహదారుల విస్తరణకు అడ్డుగా ఉన్న ఏళ్ల నాటి భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. దీని కారణంగా ఉమ్మడి జిల్లాలో అటవీ శాతం సుమారు 5 శాతం పైగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి పేరిట పెద్ద కొండలు, అడవులను చదును చేస్తూ ఉండడంతో వాతావరణ అసమతుల్యం ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లాలో అటవీ శాతం సైతం తక్కువగానే ఉంది.

విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగం..

ఇక వాతావరణ కాలుష్యం పెరగడంలో ముఖ్యమైన మరో కారణం ప్లాస్టిక్‌ వినియోగం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిషేధిత ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వాడకం మరింత పెరిగిపోయి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.

మనమేం చేయాలి..

  • బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి.
  • ఎవరికి వారే ప్లాస్టిక్‌ వినియోగాన్ని త్యజించాలి.
  • వాహనాల వినియోగం వీలైనంతగా తగ్గించి.. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి.
  • ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ పొలాల్లో నీరు, విద్యుత్తు వృథాను అరికట్టాలి.
  • వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాట్లు చేయాలి.
  • ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థపు నీటిని సైతం భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు చేయాలి.

చెట్లు పెంచడమే ఏకైక మార్గం

రావుల శ్రీనివాస్‌, పర్యావరణ ప్రేమికుడు, మిర్యాలగూడ

భూతాపాన్ని తగ్గించేందుకు మన వద్ద ఉన్న ఏకైక మార్గం చెట్లను విరివిగా పెంచడమే. లేదంటే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. చెట్లు పెంచాలనే లక్ష్యంతో పలు ప్రాంతాల్లో ప్లకార్డుతో రోజంతా నిల్చుని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. మొక్కలను పెంచేందుకు ముందుకొచ్చే వారికి నేను ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని