logo

పోలింగ్‌ ఏర్పాట్లలో యంత్రాంగం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌నకు ఇంకా ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల సామగ్రి, ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలింపు ప్రక్రియ పూర్తయింది.

Published : 06 May 2024 02:37 IST

ఈవీఎంల తరలింపు పూర్తి

ఈవీఎం యంత్రాలు అమర్చడంపై అవగాహన కల్పిస్తున్న మాస్టర్‌ ట్రైనరు 

భువనగిరి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌నకు ఇంకా ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల సామగ్రి, ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలింపు ప్రక్రియ పూర్తయింది. ముందస్తుగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటింగ్‌ క్రతువు ప్రారంభించారు. పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ కూడా శనివారం నుంచి ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమయుమ్‌ ప్రత్యేక పర్యవేక్షణ, రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే ఆధ్వర్యంలో ఏఆర్వోలు పోలింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 18,08,585 మంది ఓటర్లు 2,141 పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 8,023 బ్యాలెట్‌ యూనిట్లు, 2,673 కంట్రోల్‌ యూనిట్లు, 2,994 వీవీప్యాట్లు సిద్ధం చేశారు.

నియోజకవర్గ స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఈవీఎంలు

లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం నుంచి ఈవీఎంలు పంపించగా అక్కడే వాటి ర్యాండమైజేషన్‌ పూర్తయింది. అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లు, బ్యాలెట్‌ యూనిట్లను పంపించారు. బ్యాలెట్‌ పేపర్లను ముద్రించి బ్యాలెట్‌ యూనిట్లలో అమర్చే పని చేపట్టనున్నారు. రికార్డు స్థాయిలో 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరమయ్యాయి. అదనంగా సుమారుగా 4,500 పైగా బీయూలను తెప్పించి ఏఆర్వోలకు అప్పగించారు. వీటన్నింటిని  నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నెల 12 ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్లలెక్కింపు జరిగే భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలకు తరలిస్తారు.

పూర్తయిన శిక్షణ..

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ శిక్షణ పూర్తి చేశారు. రెండు విడతలుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది నియామకానికి సంబంధించి యాదృచ్ఛికీకరణ పూర్తయ్యింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి పీవో, ఏపీవోలు, ఇద్దరు ఇతర పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. 10 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ నిశితంగా పరిశీలన, వెబ్‌ కాస్టింగ్‌కు సూక్ష్మ పరిశీలకులను నియమించారు. వారికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమయుమ్‌ స్వయంగా దిశానిర్దేశం చేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సిబ్బంది 440 మందిని మైక్రోఅబ్జర్వర్లుగా  నియమించారు. పోలింగ్‌ చీటీలు, ఓటర్‌ గైడ్‌ల పంపిణీ కూడా పూర్తి చేశారు. పోలింగ్‌ స్టేషన్లను సందర్శించి చలువ పందిళ్లు, చల్లటి తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నారు. దివ్యాంగుల కోసం వీల్‌ ఛైర్మన్లు సిద్ధంగా ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని