logo

స్వేచ్ఛగా ఓటు వేసేలా..!

శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఆయా వసతులను ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు అనువుగా తీర్చేదిద్దేందుకు అధికారులు మరోసారి ఏర్పాట్లు చేపడుతున్నారు.

Published : 06 May 2024 02:55 IST

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

సూర్యాపేటలో పోలింగ్‌ కేంద్రంలో చేపడుతున్న పనులను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఆయా వసతులను ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు అనువుగా తీర్చేదిద్దేందుకు అధికారులు మరోసారి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మండుటెండలకు ఓటర్లు ఇబ్బందులు పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధుల నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు మౌలిక వసతుల లేమి అడ్డురాకుండా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు వేసే కార్యక్రమం మొదలైంది. మిగిలిన ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. గతేడాది శాసనసభ ఎన్నికల్లో చేపట్టిన శాశ్వత పనులు మినహా మిగతా పనులను గుర్తించి క్షేత్రస్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటికి అధికారులు ఆమోదం తెలిపిన తరువాత పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తి అయ్యాయి. మిగిలినవి వేగంగా పూర్తిచేసేలా ఎన్నికల అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు.

వేసవిలో ఇబ్బందులు లేకుండా..

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 3,580 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 35,16,658 మంది ఓటర్లకు అనుగుణంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేపడుతున్నారు. మే 13న పోలింగ్‌ ఉండటంతో అందుకు అనుగుణంగా ఆ లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, చల్లటి నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించారు. ప్రధానంగా విద్యుత్తు సౌకర్యం, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వృద్ధులకు, వికలాంగులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు, అందులో నీటి సౌకర్యం, భోజన వసతి కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటికి పోలింగ్‌ కేంద్రాల వారీగా నిధులు మంజూరు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని