logo

నడ్డా సభకు వేళాయె..!

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న భాజపా.. రెండు లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది.

Published : 06 May 2024 02:56 IST

నేడు చౌటుప్పల్‌, నల్గొండలో పర్యటన

జగత్‌ ప్రకాశ్‌ నడ్డా

ఈనాడు, నల్గొండ: ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న భాజపా.. రెండు లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. వీటికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హాజరవుతున్నారు. పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల ప్రచారం అనంతరం భువనగిరి లోక్‌సభ పరిధిలోని చౌటుప్పల్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ జరగనుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలోని మేకల అభినవ స్టేడియంలో జరగనున్న సభలో మాట్లాడనున్నారు.

భారీ జన సమీకరణకు కసరత్తు

అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లాకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రానుండటంతో భాజపా శ్రేణులు భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను సానుకూలంగా మలుచుకునేందుకు ఈ సభలను ఉపయోగించాలని నేతలు భావిస్తున్నారు. చౌటుప్పల్‌ సభకు భువనగిరి లోక్‌సభ, నల్గొండలో ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగాజనసమీకరణ చేసేందుకు ఇప్పటికే బూత్‌ స్థాయిలో కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ లోక్‌సభకు ఇన్‌ఛార్జ్‌గా తమిళనాడుకు చెందిన మురుగన్‌ను నియమించిన పార్టీ అధిష్ఠానం ఆయన ద్వారా పార్టీ, ప్రచార పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నివేదికలను తెప్పించుకుంటుంది. ఈ దఫా క్షేత్రస్థాయిలో భారీగా ఓట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న కమళనాథులు...పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో జాతీయ, ముఖ్య నాయకులతో రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైతో రెండు మూడ్రోజుల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు.

చురుగ్గా ఏర్పాట్లు

నీలగిరి, న్యూస్‌టుడే: నల్గొండ పట్టణంలోని మేఖల అభినవ్‌ స్టేడియంలో నిర్వహించే సభ ఏర్పాట్లను ఆదివారం భాజపా నాయకులు పరిశీలించారు. సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. సభకు వచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నర్సింహారెడ్డి, నల్గొండ లోక్‌సభ నియోజక వర్గం ప్రభారి చాడ శ్రీనివాస్‌ రెడ్డి, కోన్వీనర్‌ పిల్లి రామరాజు యాదవ్‌, పోతేపాక సాంబయ్య, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని