logo

చివరి భూములకూ సాగు నీరందిస్తాం: జానారెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్‌షో, కార్నర్‌ సమావేశం నిర్వహించారు.

Updated : 08 May 2024 06:18 IST

త్రిపురారం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్‌షో, కార్నర్‌ సమావేశం నిర్వహించారు. త్రిపురారం మండలంలో ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి చివరి భూములకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సాగర్‌ నియోజకవర్గం నుంచే లక్షన్నర మెజార్టీ తీసుకురావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం భారీ గజమాలతో వారిని సత్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాస్కర్‌నాయక్‌, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, బిట్టు రవి, నరేందర్‌, భరత్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.


ప్రజా ప్రభుత్వం కోరేవారంతా కాంగ్రెస్‌ను గెలిపించాలి

-డిప్యూటీ సీఎం భట్టి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: భారాస అవినీతి పార్టీ అని, భాజపా రైతు వ్యతిరేకని.. ఈ రెండింటికి ఓట్లు వేస్తే వృథా అవుతాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యాంగ రిజర్వేషన్ల ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. చౌటుప్పల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరి లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. భువనగిరి కాంగ్రెస్‌కు కంచుకోటని,  ఈ ఎన్నికల్లో సైతం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. రైతుబంధు కోసం రూ.7,624 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దేశ సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్‌ కృషి చేస్తుంటే భాజపా అదానీ అంబానీలకు దోచిపెట్టాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు. భారాస, భాజపా అభ్యర్థులు అనవసరంగా తిరుగుతున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు తేవడానికి, జాతీయ రహదారి విస్తరణకు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేష్‌, పురపాలిక చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరు వెంకట్‌రెడ్డి, పబ్బు రాజుగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ బస్సుయాత్రతో కాంగ్రెస్‌, భాజపా నాయకుల్లో వణుకు

-జగదీశ్‌రెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సుయాత్ర చేపట్టాక భాజపా, కాంగ్రెస్‌ నాయకుల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భారాస పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి నామపత్రాల సమర్పణ సందర్భంగా మంగళవారం నల్గొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ పని అయిపోయిందనుకున్న వాళ్లందరూ ప్రజల మద్దతు చూసి భయపడి పోతున్నారన్నారు. దేవుళ్ల పేరుతో ఒకరు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మరొకరు ప్రజలను ఓట్లు అడుగుతున్నారే తప్ప అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం వారికి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని గెలిపించడానికి మోదీ సహకరిస్తే , లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గెలిపించడానికి రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి మండలి ఎన్నికల్లో రాకేశ్‌ను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా నిలుస్తారన్నారు. అనంతరం గడియారం సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వద్దకు వాహన ర్యాలీగా వెళ్లి నామ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్సీ తాత మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌ నాయక్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్య యాదవ్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ పార్టీలో కుటుంబ పాలనే

-సైదిరెడ్డి

కోదాడ, కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం నల్గొండ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్‌ నుంచి రాహుల్‌ గాంధీ వరకు కుటుంబ పాలనే నడుస్తోందని భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని రామ్మూర్తి నగర్‌లో నిర్వహించిన జనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు కేంద్ర నిధులతోనే నిర్మించారన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు ఇచ్చారని భాజపాపై దుష్ప్రచారం చేయడం విడ్డూరం అన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలను కలవాలంటే, ముందస్తుగా మధ్యవర్తులను కలవాల్సిన దుస్థితి ఉందన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్‌ కనగాల నారాయణ, నల్గొండ కన్వీనర్‌ ప్రసాద్‌, నూనె సులోచన, శ్రీనివాసరెడ్డి, శ్రీలతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గాలి దుమారం.. కూలిన టెంట్లు..  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ సభాస్థలికి వచ్చే సమయానికే విపరీతమైన గాలి వీచింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ముందస్తుగా ఆయన ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతుండగా గాలి దుమారానికి సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోవడంతో ప్రజలు పరుగులు తీశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని