logo

పార్టీలు చిన్నవైనా.. ప్రభావం పెద్దది

గడిచిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు చిన్నవైనా ప్రభావం పెద్దగానే చూపిన ఘటనలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన వైనం లేకపోలేదు.

Published : 08 May 2024 04:01 IST

స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య క్రమేణా పెరుగుతున్న వైనం
అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీపై ప్రభావం
రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే

డిచిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు చిన్నవైనా ప్రభావం పెద్దగానే చూపిన ఘటనలున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన వైనం లేకపోలేదు. ప్రతీసారి ఎన్నికల్లో స్వతంత్రులు పదుల సంఖ్యలో బరిలో నిలస్తున్నారు. వీరికి లభించిన ఓట్లు పెరిగిన కారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల మెజార్టీ శాతం తగ్గడం చూస్తున్నాం. ప్రస్తుత నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి మొత్తం 22 మంది, భువనగిరి స్థానానికి 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు, ఐదుగురు మినహా మిగతా వారంతా చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే. ప్రచారానికి కొద్ది రోజులే గడువుండటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేశారు.

2014 ఎన్నికల్లో స్వతంత్రుల హవా..

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం విషయానికొస్తే స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది. అప్పటి తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేవలం 30,488 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు 76,388 ఓట్లు రాగా, బీఎస్పీ, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా మజ్లీస్‌ ఈ ఇత్తాహదుల్‌ ముసల్మాన్‌, మహాజన సోషలిస్టు పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీలు కలిపి 21,381 ఓట్లు మాత్రమే దక్కించుకున్నాయి.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి 4,72,093 ఓట్లు పొంది సమీప తెదేపా అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 1,93,156 ఓట్ల మెజార్టీ సాధించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2,60,677 ఓట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. సీపీఎంతో కలుపుకుని వైఎస్సార్‌ సీపీ, బీఎస్పీ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులకు కలిపి మొత్తంగా 1,12,128 ఓట్లు రావడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థి నేమయ్యకు 56,259 ఓట్లు పడ్డాయి.

2019 ఎన్నికల్లో మెజార్టీపై ప్రభావం..

ఈ విడత జరిగిన ఎన్నికల్లో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి గెలుపొందిన ఆయా ప్రధాన పార్టీ అభ్యర్థుల మెజార్టీలపై తీవ్ర ప్రభావం చూపారు. ముఖ్యంగా నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజార్టీ సాధించారు. బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులందరూ కలిపి 48,771 ఓట్లు దక్కించుకోగా.. సీపీఎం అభ్యర్థితో కలుపుకుని జనసేన పార్టీ, బీఆర్పీ, టీఎస్పీ, ఎస్‌ఐపీఐ, ఏఎన్‌సీ, బీఎంయూపీ పార్టీల అభ్యర్థులకు కలిపి మొత్తం 25,785 ఓట్లు రావడం గమనార్హం.

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సమీప తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై కేవలం 5,219 ఓట్ల మెజార్టీ మాత్రమే దక్కింది. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి 42,407 ఓట్లు రాగా, చిన్నపార్టీలు 5,219 ఓట్లు దక్కించుకున్నాయి. స్వతంత్రులు, చిన్నపార్టీల అభ్యర్థులు బరిలో ఉన్న కారణంగా గెలిచిన అభ్యర్థుల మెజార్టీ బాగా తగ్గడం తెలిసిందే.

పట్టువదలని విక్రమార్కుడిలా..

మారిన ప్రచార సరళి, ఇతరత్రా వ్యయాల కారణంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సాధారణ వ్యక్తులు స్వతంత్రులుగా పోటీ చేసి తట్టుకోవడం కష్టంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన, ప్రజలతో మమేకమవడం, పక్కా ప్రణాళికలతో స్వతంత్రులుగా పోటీ చేసి తమదైన ముద్ర వేసుకుంటున్న నాయకులు ఎందరో ఉన్నారు. పార్టీలు చిన్నవే అయినా, స్వతంత్ర అభ్యర్థులు తామేం తక్కువ కాదని బరిలో నిలబడి తమ సత్తా చాటుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఓటర్లు ఆసారైనా ఆదరిస్తారనే గంపెడంత ఆశతో తరచూ ఓటమి పాలవుతున్నా మనో నిబ్బరంతో క్రమం తప్పకుండా ప్రతిసారీ ఎన్నికల్లో నిలబడుతున్న పట్టువదలని విక్రమార్కులు సైతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎందరో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని