logo

అభ్యర్థి ముఖం చూపడాయె.. ఓటెవరికి వేద్దాం..!

ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్‌ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య.

Published : 09 May 2024 07:01 IST

ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్‌ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య. ఎన్నికల ప్రచారమే.. కానీ, అభ్యర్థి లేడు. మైక్‌లో రెండు పాటలు, లోకల్లీడర్ల మాటలే తప్ప ఏమీ లేదక్కడ.. ఈడికి రా మాట్లాడుకుందాం.. అన్నాడు రామస్వామి.

అంతేనా.. వస్తున్న మరి..

ఎన్నికలెట్లున్నవే యాదన్న.. మనూరోళ్లే తప్ప, మరో పెద్ద నాయకుడు కూడా ప్రచారానికి రాకపాయె. ఊరి సమస్య చెబుదామంటే.. తీర్చడం వీళ్లవల్ల కాదని తెలుసు. జర పెద్దోళ్లు, పోటీ చేసే అభ్యర్థి వస్తే బాగుండు. వాళ్లేమో మన వైపే చూడటం లేదాయె అన్నాడు యాదయ్య. మొన్నపోయిన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కనీసం ఒక్కసారన్నా గ్రామానికి వచ్చి ప్రచారం చేసిండ్లు. నాలుగు సమస్యలు చెప్పినం. వాళ్లూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఎవరూ మన వంక చూడట్లేదాయో చెప్పుకొచ్చిండు రామస్వామి. అభ్యర్థి ఊరు, పేరు తెలియదాయే. ముఖం కూడా చూపెట్టడాయే. ఏ పార్టీ అభ్యర్థి ఎవరూ ఒక్కరూ రాకపోయే. ఓటెట్లా వేద్దామే.. అంటూ అక్కడి వస్తూ అడిగాడు నర్సయ్య.

మరి ఏంచేద్దామంటరు..

అభ్యర్థి రాడు. పెద్దనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలూ రారు. కనీసం మండల నాయకులు కానరారు. ఎట్లా.. అక్కడికొస్తూ అన్నాడు శంకరయ్య. గెలిచినాక ఎట్లగూ మన ఊళ్లకు రారు. వాళ్లకు మనం కనిపించం. ఇప్పుడన్నా ఊర్లోకొస్తే.. మన సమస్యలెంటే చెప్పి మాట తీసుకోవచ్చు. ఇదే మాట మండల నాయకుల ద్వారా ఎమ్మెల్యేకు, ఆన్నుంచి అభ్యర్థి చెప్పిద్దాం ఉపాయమిచ్చాడు రామస్వామి. సరేనంటూ.. మిగతా వారంతా కలిసి మరికొందర్ని వెంట బెట్టుకుని ఊర్లోకి బయలుదేరారు.

న్యూస్‌టుడే, మోత్కూరు

చరవాణి ద్వారా బూత్‌ స్లిప్‌లు

నడిగూడెం: ఏ పోలింగ్‌ బూత్‌లో ఓటు ఉందో తెలుసుకునేందుకు ఓటరు గుర్తింపు స్లిప్పుల జారీకి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1950 నంబరుకు ఈసీఐ స్పేస్‌ మీ ఓటరు ఐడితో ఎస్‌ఎంఎస్‌ చేస్తే 15 సెకన్లలో మీకు ఎలక్షన్‌ బూత్‌ స్లిప్‌ వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని