logo

ఆదుకోవాలని అన్నదాతల నివేదన

ఈ ఏడాది ప్రకృతి రైతన్నలపై కన్నెర్ర చేసింది. పెరిగిన ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులకు సైతం ఎదురొడ్డి సాగు చేసినప్పటికీ అకాల వర్షంతో భారీగా నష్టపోయారు. 

Published : 30 Mar 2023 03:46 IST

న్యూస్‌టుడే, జలదంకి, దుత్తలూరు

ఈ ఏడాది ప్రకృతి రైతన్నలపై కన్నెర్ర చేసింది. పెరిగిన ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులకు సైతం ఎదురొడ్డి సాగు చేసినప్పటికీ అకాల వర్షంతో భారీగా నష్టపోయారు.  కోత కొచ్చిన వరి కళ్ల ముందే నేలవాలి నీటిలో నిల్వ ఉండి మొలకెత్తు తుంటే.. చేతికొచ్చిన పంట దిగుబడులు చేజారి పోతున్నాయంటూ అన్నదాతలు కన్నీటి పర్యంత మవుతున్నారు.

జలదంకి మండలం బి.కె. అగ్రహారంలో నీటమునిగిన వరి

జలదంకి మండలంలో సుమారు 22 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ముందస్తుగా పది వేల ఎకరాల్లో పంట కోతలు కోసి ధాన్యాన్ని విక్రయించారు. అన్నవరం, చినక్రాక, గట్టుపల్లి, జలదంకి, ఎల్‌ఆర్‌ అగ్రహారం గ్రామాల్లో మార్చి 19వ తేదీ కురిసిన వాడగండ్ల వాన, పెనుగాలులకు కోతలకు సిద్ధంగా ఉన్న వందలాది ఎకరాల్లో వరి కంకులకు గింజలు రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలింది. పలువురు కోత కోయకుండానే పంటలను పశువుల మేతకు వదిలేశారు. మరి కొంత పొలం నేలవాలి నీట మునగడంతో ధాన్యం తడిచి మొలకలొస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు.  ఈనెల 23వ తేదీ మండలంలోని జలదంకి, జమ్మలపాలెం, బ్రాహ్మణక్రాక, బీకే అగ్రహారం, చామదల, కమ్మవారిపాలెం తదితర గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన, పెనుగాలులకు అరకొరగా ఉన్న వరి పంటకు సైతం గింజలు రాలిపోయి, పంట నీటిలో వాలిపోయి ధాన్యానికి మొలకలొస్తూ వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని బీకే అగ్రహారం, చామదల గ్రామాలకు చెందిన రైతులు బండారు తిరుపతిరెడ్డి, డి.విజయ భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, తిరుపాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ఉన్న పంట దిగుబడులను సైతం కోతకోసుకునేందుకు ఈ ఏడాది వరుణుడు అడ్డంకిగా మారడంతో తీవ్ర నష్టల బారిన పడుతున్నామని పలువురు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. పంట నష్టాలపై మండల వ్యవసాయాధికారిణి బి.శైలజను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా గ్రామ వ్యవసాయ సహాయకులు పంట నష్టాలను అంచనా వేస్తూ  రైతుల వివరాలు నమోదు చేస్తున్నారని, జిల్లా అధికారులకు నివేదించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని