logo

జగన్‌ జమానాలో పప్పన్నం కష్టమే!

‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు.

Published : 20 Apr 2024 04:57 IST

ఏడాదిగా రేషన్‌ దుకాణాల్లో అరకొరగా కందిపప్పు సరఫరా
16 నెలల్లో రూ.137.13 కోట్లు మిగుల్చుకున్న వైనం

‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. వైకాపా పాలనలో పరిస్థితి మార్చేస్తామని హామీలు ఇచ్చి.. పేద, మధ్య తరగతి ప్రజల కడుపుపై కొట్టారు.’

‘తెదేపా ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల దుకాణాల్లో రూ.80కే రెండు కిలోల(కిలో రూ.40) కందిపప్పు ఇస్తే.. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కిలోకు రూ. 27 పెంచి.. రూ. 67 చొప్పున పంపిణీ చేశారు. ఆ తర్వాత రెండు కిలోలు కాస్త కిలో అయింది. గత ఏడాది జనవరి నుంచి క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. జులై నుంచి నామమాత్రంగా మారింది. చివరకు తెదేపా హయాంలో ఇచ్చే పండగ కానుకలు ఇవ్వకపోవడంతో పప్పన్నం తినడమూ పేదలకు కష్టంగా మారింది.’

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

జగన్‌ అధికారంలోకి వచ్చాక పండగల సమయంలోనూ కిలో కందిపప్పు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. పండగ కానుకలు ఎలాగూ ఎత్తేశారు. కనీసం రేషన్‌ సరకులైనా సక్రమంగా ఇవ్వండన్న పేదల వేడుకోలు పట్టించుకోలేదు. ఫలితంగా పేదలు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.160 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. వైకాపా ప్రభుత్వం కార్డుదారుల కష్టాలు పట్టించుకోకపోగా.. ఒక నెల పంపిణీ చేయకపోతే.. ఆ మేరకు డబ్బు మిగిలిపోతుందన్నట్లు వ్యవహరించింది. చిత్తశుద్ధి ఉంటే.. ముందే టెండర్లు పిలిచి నిల్వలను సిద్ధం చేసేది. ప్రభుత్వం మాత్రం ఏవేవో సాకులతో కోతపెట్టి.. పేదలను గాలికి వదిలేసింది. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు రూ. 85.71 కోట్ల భారం పేదలపై మోపింది.

నిరుపేదలపై అదనపు భారం

జిల్లాలో 7,37,486 మంది బియ్యం కార్డుదారులు ఉండగా- 1,513 చౌక దుకాణాల పరిధిలో 438 ఎండీయూ వాహనాల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నారు. నెలకు 737 టన్నుల కందిపప్పు అవసరం. 2023 జనవరి నుంచి 2024 ఏప్రిల్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసింది. 16 నెలల్లో జిల్లా వ్యాప్తంగా కార్డుదారులందరికీ కలిపి 11,648 టన్నులను కిలో రూ.67 చొప్పున రాయితీపై అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 3075.89 టన్నులు మాత్రమే పంపిణీ చేసింది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ. 160 నుంచి రూ.180 పలుకుతోంది. కందిపప్పు సరఫరాను ప్రభుత్వం పూర్తిగా తగ్గించేసింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మరీ అధ్వానంగా ఉంది. మొత్తంగా రూ. 137.13 కోట్లు మిగుల్చుకుంది.

పంపిణీ తీరుపైౖ.. ప్రజల్లో వ్యతిరేకత!

ఇంటింటికే రేషన్‌ సరకులు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తున్నా.. పంపిణీ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎండీయూ వాహనానికి సమయపాలన లేకపోవడంతో.. సరకుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని లబ్ధిదారులు చెబుతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన సరకుల్లోనూ ప్రస్తుతం కోత విధించడంతో.. ప్రజలు స్థానిక వైకాపా నాయకులతో పాటు ఎండీయూ వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. కందిపప్పు ఎందుకు ఇవ్వరంటూ కార్డుదారులు ఎండీయూ వాహనదారులతో కొన్నిచోట్ల వాగ్వాదానికి దిగుతున్నారు. గత ప్రభుత్వం పండగలకు నిత్యావసర సరకులు ఇచ్చేదని, వాటిని వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. వైకాపా పాలనలో చివరకు పండగల పూట పప్పన్నం తినలేని దుస్థితిలో ఉన్నామని ధ్వజమెత్తుతున్నారు.


ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా?

కొన్నేళ్లుగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి తగ్గట్టుగా సంపాదన పెరగలేదు. ఖర్చులు తగ్గలేదు. అద్దెలతో సహా.. పాలు, పెరుగు, పప్పు, ఉప్పు ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా కొన్ని నిత్యావసర వస్తువులు ఇస్తే బాగుండేది. గతంలో కందిపప్పు ఇచ్చేవారు. ప్రస్తుతం అది రావడం లేదు. దాంతో బయట రూ. 160 పెట్టి కొంటున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు అన్నీ అందుతున్నాయా? అని అడిగే ప్రజాప్రతినిధులకు పేదల కష్టాలు తెలిస్తే కదా? 

సత్యవతి, నెల్లూరు


నెలల తరబడి అందడం లేదు

బయట మార్కెట్‌లో కందిపప్పు ధర ఎక్కువగా ఉంటోంది. రేషన్‌ ద్వారా మొదట్లో ఇచ్చేవారు. తర్వాత క్రమంగా తగ్గించారు. ఒక నెల ఇస్తే.. మరో నెలా ఇచ్చేది. బహిరంగ మార్కెట్‌లో కొనాలంటే పేదలపై భారం పడుతుంది. మా ప్రాంతంలో కొందరు ఎండీయూ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. పాలకులే పట్టించుకోవాలి. 

పుష్పలత, నెల్లూరు


ఎప్పుడిస్తారో తెలియదు

ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే సరకుల కోసం ప్రతినెలా ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తోంది. ముఖ్యమైన పని ఉన్నా.. వాయిదా వేసుకోవాల్సిందే. అలాగని మొత్తం సరకులు ఇస్తున్నారా? అంటే అదీ లేదు. బియ్యం, చక్కెర అరకిలో మాత్రమే ఇస్తున్నారు. ఎప్పుడైనా కందిపప్పు ఇస్తే.. అది సక్రమంగా ఉడకడం లేదు. గతంలో గోధుమ పిండి ఇచ్చేవారు. ప్రజాప్రతినిధులు పట్టించుకుని ముఖ్యమైన సరకులైనా రేషన్‌ దుకాణాల ద్వారా అందిస్తే పేదలకు ప్రయోజనం ఉంటుంది. 

మంజుల, నెల్లూరు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని