logo

కోట్ల వ్యయం.. నిరుపయోగం

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది.

Published : 26 Apr 2024 05:06 IST

వైద్య కళాశాల శిక్షణ కేంద్రం దుస్థితి
తలుపులు తెరుచుకోలేదు
వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం

సంగంలోని వైద్య కళాశాల శిక్షణ కేంద్రం

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. సంగంలో రూ. 1.27 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రం ప్రారంభం మినహా వినియోగంలోకి తీసుకురావటంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. దీంతో నిధుల వ్యయం మినహా దీని వలన వైద్య  విద్యార్థులకు ఎలాంటి మేలు చేకూరలేదు.

న్యూస్‌టుడే, సంగం: నెల్లూరులోని ఏ.సి.సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఆరోగ్య స్థితిగతులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా అందే వైద్య సదుపాయాలు, చికిత్స తదితర అంశాల్లో శిక్షణ పొందటానికి వీలుగా సంగం పీహెచ్‌సీని ఎంపిక చేశారు.

  • దీనికి అనుగుణంగా రూ.1.27 కోట్ల వ్యయంతో శిక్షణ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు అవసరమైన భవనాన్ని 106 అంకణాల విస్తీర్ణంలో ఒక అంతస్తు భవనంగా నిర్మించారు.
  • ఒకేసారి 36 మంది విద్యార్థులు శిక్షణ పొందేందుకు అవసరమైన రూ.లక్షల విలువైన వైద్య పరికరాలు సమకూర్చారు. వారి వసతి కోసం 12 గదులు, ప్రొఫెసర్‌కి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. రూ. 40 లక్షల వ్యయంతో 480 చదరపు అడుగుల వైశాల్యంలోఏ.సి.తో కూడిన సమావేశ మందిరం, విశాలమైన అలమరాలు, పరుపు మంచాలతోపాటు ఆధునిక వసతులతో వంటగది, భోజనశాల నిర్మించారు.
  • ఇక్కడి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యాధికారులు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇద్దరే ఉన్నారు. ఒకరు క్షేత్ర పర్యటనకు వెళ్లినా, మరొకరు సెలవు పెట్టినా సిబ్బంది ద్వారా మాత్రమే సేవలు అందుతున్నాయి. శిక్షణ కేంద్రం కొనసాగుతుంటే 24×7 గంటలపాటు వైద్య విద్యార్థులు, ప్రాథమిక వైద్యచికిత్స అత్యవసరంగా అందుబాటులో ఉంటాయి. అత్యంత విలువైన వైద్య పరికరాలు ఎంతో ఉపయోగపడతాయి.
  • ఈ కేంద్రాన్ని దివంగత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 2019 ఆగస్టు ఏడోతేదీన ప్రారంభించారు. ఆ తరువాత దీని తలుపులు తెరచుకోలేదు. ఇప్పటికి అదే పరిస్థితి. ఫలితంగా వైద్య విద్యార్థులకు శిక్షణ దూరమైంది. వారు దానితో సంబంధం లేకుండా పీహెచ్‌సీలోనే వైద్యాధికారుల పర్యవేక్షణలో నామమాత్రంగా శిక్షణ పొందుతున్నారు. దాంతో విలువైన వైద్యపరికరాలు నిరుపయోగంగా మూలపడ్డాయి.

అవస్థ పడుతున్నారు

ఎన్‌.శ్రీహరినాయుడు

శిక్షణ కేంద్రం మూతపడటంతో సంగంతోపాటు చుట్టుపక్కల ప్రజలు వైద్య సేవల విషయంలో అవస్థ పడుతున్నారు. కనీసం ఈసీజీ చూసే దిక్కు కూడా లేదు. ఇప్పటికైనా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని