logo

ప్రజాకంటక పాలన.. ప్రయాసలే వాడవాడనా

పట్టణంలోని విప్పగుంటరోడ్డులో నివాసితులను మౌలిక వసతుల సమస్య వేధిస్తోంది.

Published : 28 Apr 2024 02:33 IST

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని విప్పగుంటరోడ్డులో నివాసితులను మౌలిక వసతుల సమస్య వేధిస్తోంది. చాకలిపాలెం నుంచి రామానాయుడునగర్‌ కూడలి వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. చాకలిపాలెం కూడలిలో చప్టా దెబ్బతిని కొత్త సమస్య తెచ్చిపెట్టింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే.. వెనుకడుగు వేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కన నుంచి వెళ్లే విప్పగుంట రోడ్డులో మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 29 వార్డుల పరిధిలో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉండి.. చాకలిపాలెం చప్టా దెబ్బతిని.. బస్సులు, కార్లు, ఆటోలు ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. విప్పగుంటరోడ్డు, చాకలిపాలెంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేవు. వర్షాకాలంలో ఇళ్ల మధ్య నీరు నిలిచి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులకు,  అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయగిరి, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో 14, 15, 16 వార్డుల్లో సమస్యలు పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వం గడప గడపకు పేరుతో సమస్యలు పరిష్కరిస్తామని ప్రచారాలు చేసినా ఫలితం కనిపించటంలేదు. యాదవ వీధిలో మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేదు. మూడురోజులకొకసారి నీరు సరఫరా చేస్తున్నారు. బాలాజీనగర్‌లో కొన్ని ప్రాంతాల్లో మురుగు వ్యవస్థ సరిగా లేక రోడ్లపై ప్రవహిస్తోంది. చెత్త వేసుకునేందుకు కుండీలు కూడా ఏర్పాటు చేయలేదు. సీసీ రోడ్లు కంకర తేలి అధ్వానంగా ఉన్నాయి.

వార్డులు: 14, 15, 16
ప్రాంతాలు: యాదవవీధి, బాలాజీనగర్‌, బీసీ కాలనీ, స్టేట్‌పేట , కాలనీ, ఎస్టీ కాలనీ, మంగళగిరి కాలనీలు
జనాభా:  5176
సమస్యలు: తాగునీరు, రోడ్లు, అస్తవ్యస్తంగా మురుగు వ్యవస్థ

కల్వర్టుతో ఇబ్బందిగా ఉంది: టి.బ్రహ్మయ్య, స్థానికుడు

పట్టణంలో విప్పగుంటరోడ్డు ఓ ప్రధాన వీధి కావడంతో నిత్యం ఇటు ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. మార్గమధ్యలో చాకలికుంట అలుగు వద్ద ఉన్న కల్వర్టు రెండు నెలలు క్రితం దెబ్బతింది. దీంతో పెద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు.


నీటి సమస్యతో సతమతం

జి.పిచ్చయ్య

యాదవ వీధిలో పంచాయతీ ద్వారా మూడు రోజులకొకసారి నీటి సరఫరా చేస్తున్నారు.  కనీసం వాడుకొనేందుకు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. పట్టణంలో ఎక్కడ చూసినా నీటి సమస్య ఉంది.


దుర్వాసన భరించలేకున్నాం

రెహమాన్‌

బీసీ కాలనీలో కాలువలు శుభ్రం చేయక దుర్వాసన వస్తోంది. ఎక్కడిక్కడ చెత్తాచెదారాలతో స్తంభించాయి. పాలకులు వీటిని శుభ్రం చేయించి సమస్య లేకుండా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని