logo

ఇళ్లు.. ఊళ్లు.. ఏమయ్యాయ్‌?

పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.. ఇందుకు జగనన్న కాలనీలు ఏర్పాటుచేస్తాం. ఊళ్లే ఏర్పాటవుతాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అప్పగించారు. కానీ వాటిలో సౌకర్యాలు ఏర్పాటుకాలేదు. నడిచేందుకు రోడ్డు.. తాగేందుకు నీరు లేక పడరాని పాట్లు పడుతున్నారు.

Updated : 09 May 2024 06:02 IST

న్యూస్‌టుడే బృందం

పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.. ఇందుకు జగనన్న కాలనీలు ఏర్పాటుచేస్తాం. ఊళ్లే ఏర్పాటవుతాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అప్పగించారు. కానీ వాటిలో సౌకర్యాలు ఏర్పాటుకాలేదు. నడిచేందుకు రోడ్డు.. తాగేందుకు నీరు లేక పడరాని పాట్లు పడుతున్నారు. వీధుల్లో అంధకారంతో రాత్రిళ్లు భయంభయంగా గడుపుతున్నారు. దీంతో ఈ కాలనీల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి ఎంతోమంది వెనుకంజ వేస్తున్నారు. ఇవన్నీ వెలవెలబోతున్నాయి.


నాసిరకంగా..

కావలి: రాష్ట్రంలోనే పెద్ద జగనన్న లేఅవుట్లలో కావలి కూడా ఒకటి అంటూ ఊదరగొట్టారు. గత ఏడాది ఉగాదికే గృహ ప్రవేశాలు అన్నారు. వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే, ప్రభుత్వ కాలం పూర్తై ఎన్నికలు వచ్చాయి. లేఅవుట్‌లో వేసిన బోర్లు, పైపులైన్‌ పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్లలో చాలా వరకు నీరు పడలేదు. నిధులు మాత్రం వృథా అయ్యాయి. అక్కడక్కడా ఉన్న బోర్ల ద్వారా మాత్రమే నీరు అందించాల్సి వస్తోంది. ఇళ్ల కట్టుబడి క్యూరింగ్‌ కోసం పురపాలక తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించారు.  కడకు క్యూరింగ్‌ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల గత ఏడాది డిసెంబరులో  వచ్చిన వర్షాలకు కట్టే ఇళ్లు కూలిపోయాయి.


పునాదులకే పరిమితం...

దుత్తలూరు : ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు సెంటున్నర స్థలం ఇవ్వడమే కాకుండా వారికి ప్రభుత్వం తరఫునే ఇళ్లు నిర్మించి అన్ని రకాల  వసతులు కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 308.19 ఎకరాల్లో 228 లేఅవుట్లను వేసి 11,939 మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ కాలనీలో కూడా నీటి సౌకర్యం తప్ప మిగిలిన సదుపాయాలు కల్పించలేదు. చాలా లేఅవుట్లలో ఇళ్లు పునాదులు దాటలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల విద్యుత్తు సౌకర్యం కల్పించినా అందుబాటులోకి రాలేదు. ఏ లేఅవుట్లో కూడా రోడ్లు వేసిన దాఖలాల్లేవు. గుత్తేదారులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతోనే జగనన్న కాలనీల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సౌకర్యాలేవన్నా!

అల్లూరు : గ్రామంలోని గోగులపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో సదుపాయాలు కరవుయ్యాయి. ఇక్కడ ఒక లైనుకు విద్యుత్తు సౌకర్యం ఇచ్చారు. మిగిలిన వీధులకు సరఫరా లేదు. నీటి సౌకర్యం అన్ని ప్రాంతాలకు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం కావడంతో దాహం తీర్చుకోవడానికి పడే అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిర్మాణ సమయంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. మురుగునీటి కాలువలు కూడా లేవు.


వసతులు కరవు

కందుకూరు పట్టణం : జగనన్న కాలనీల్లో వసతులు బాగుంటాయనుకున్న ఇళ్ల లబ్దిదారులకు నిరాశే ఎదురైంది. చెప్పే దానికి.. చేసే దానికి పొంతన ఉండదని వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో అనేక సందర్భాల్లో రుజువైంది. పట్టణ పేదలకు మున్సిపాలిటీ పరిధిలోని దివివారిపాలెం సమీపంలో లేఅవుట్‌ ఏర్పాటుచేసి అందులో ఇళ్ల స్థలాలిచ్చారు. సుమారు 300 మందికి పట్టాలివ్వగా.. తొలి విడతగా సుమారు 250 మందికి ఇళ్లు మంజూరు చేశారు. కానీ కాలనీలో ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదు. అన్నీ మట్టి రోడ్లే. అందులో ప్రధాన రోడ్డు మినహా అంతర్గత రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. కాలువల ఊసే లేదు. నీటి వసతి కోసం రెండు బోర్లు వేయగా నిరుపయోగంగా ఉన్నాయి. వసతుల లేమి ఫలితంగా పేదలు ఈ లేఅవుట్‌లో ఇళ్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపలేదు. లేఅవుట్‌లో అక్కడక్కడా కంప చెట్లు మొలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని