logo

స్వచ్ఛత.. నిర్లక్ష్యపు ఘనత

నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయడంతో కేంద్రం నగర, పురపాలికలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తోంది. బహిరంగ మలమూత్రŸ విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనేది.. ర్యాంకులు ఇవ్వడంలో ఉద్దేశం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం స్వచ్ఛ మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నవి మూతపడినా పట్టించుకోలేదు.

Updated : 09 May 2024 06:01 IST

వైకాపా ప్రభుత్వంలో సామూహిక మరుగుదొడ్లకు తాళాలు
న్యూస్‌టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ), కావలి, ఆత్మకూరు

నెల్లూరులో ఉపయోగంలో లేని స్వచ్ఛ మరుగుదొడ్లు

నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయడంతో కేంద్రం నగర, పురపాలికలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తోంది. బహిరంగ మలమూత్రŸ విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనేది.. ర్యాంకులు ఇవ్వడంలో ఉద్దేశం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం స్వచ్ఛ మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నవి మూతపడినా పట్టించుకోలేదు. అంతేకాదు గత తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన వాటికి నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఫలితంగా నగర, పట్టణాలలో బహిరంగ మూత్ర విసర్జన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

5.56 కోట్ల ప్రజాధనం వృథా

నెల్లూరు నగరపాలకసంస్థ అధికారులకు, పాలకులకు ప్రజాధనం అంటే లెక్కేలేకుండాపోతుంది. కోట్ల రూపాయల నిధులను రోడ్డుపాలు చేస్తున్నారు. గుత్తేదారులకు దోచిపెట్టడం తప్ప.. ప్రజలకు ఉపయోగం శూన్యం. నెల్లూరు నగరంలో 54 డివిజన్లు ఉండగా.. జనాభా దాదాపు 10 లక్షలకు చేరుకుంది. వివిధ ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. వాణిజ్య ప్రాంతం కావడంతో రాకపోకలకు ఎక్కువే. రెండేళ్ల క్రితం రూ.5.56 కోట్లతో 57 ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్నింటిని ప్రారంభించి.. మళ్లీ తాళాలు వేసేశారు. మరికొన్ని వివిధ దశల్లోనే ఉన్నాయి. పనులు నిలిపేశారు. కొందరు వ్యక్తులు కొన్ని టాయిలెట్లలోని ట్యాపులను ఎత్తుకుపోయారు. దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటిలో పలు మరుగుదొడ్లకు తాళాలు వేసేశారు. వీటితో పాటు సులభ్‌కాంప్లెక్స్‌ల నిర్వహణ కొరవడటంతో దుర్వాసన వస్తున్నాయి. దీంతో నగరంలో బహిరంగ మూత్ర విసర్జన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

ఆత్మకూరులో నిరుపయోగంగా..

నిర్వహణే సమస్య

ఆత్మకూరు పట్టణంలో సామూహిక మరుగుదొడ్లు లేక వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో పురపాలక బస్టాండ్‌, సోమశిల రోడ్డు సెంటర్‌, నెల్లూరుపాళెం సెంటర్‌ ప్రాధానమైనవి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. పురపాలక బస్టాండ్‌లో ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందించే మరుగుదొడ్డిలేదు. సులభ్‌ కాంప్లెక్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. సోమశిల రోడ్డు సెంటర్‌లో గతంలో పంచాయతీ వారు నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు ఉండేవి. పురపాలకం ఏర్పడటంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఆ ప్రతిపాదనలు కార్యరూపంలోకి రాకముందే ప్రభుత్వం మారింది. ఆ ప్రయత్నమే పూర్తిగా ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరుపాళెం సెంటర్‌లో పురపాలకం ఆధ్వర్యంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. కొంత కాలంగా వీటి నిర్వహణపై నిర్లక్ష్యం చూపారు. దెబ్బతిన్నాయనే సాకుతో ఒకవైపు తాళం వేశారు. మరోవైపు ఉన్నా ఉపయోగించలేని విధ]ంగా మారాయి. దాంతో అక్కడ దిగే ప్రయాణికులు అత్యవసరం అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి.

కావలి.. అక్కరకురాని నిర్మాణం

కావలిలోనూ అంతంత మాత్రమే..

కావలి పట్టణం 17వ వార్డు బుడంగుంట గిరిజన కాలనీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు... ప్రస్తుతం పురపాలక సంఘ నిర్లక్ష్యం కారణంగా అక్కరకు రావడం లేదు. ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులంతా పూరిళ్లలోనే నివసిస్తుంటారు. వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేదు. దీంతో వీటిని నిర్మించడంతోపాటు మోటార్‌, బోరువంటి వసతులు కల్పించారు. ఆ తరువాత వైకాపా హయాంలో దీనిని పూర్తిగా వినియోగించకుండా అడ్డుకున్నారు. పురపాలక సంఘం నిర్వహణను విస్మరించింది. అక్కడి గిరిజన మహిళలు బహిర్భూమికి ముళ్లపొదల చాటుకు వెళ్తున్నారు. వర్షాలొచ్చినప్పుడు వారి ఇక్కట్లు వర్ణనాతీతం. సామూహిక మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు