logo

ముందస్తు ప్రణాళిక ఏమైంది..?

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇటీవల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాంటా పూర్తయినా ధాన్యం సంచులు కల్లాల్లోనే ఉంటున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు రెండు మూడురోజులపాటు అక్కడే నిరీక్షిస్తున్నాయి.

Published : 23 May 2024 02:07 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇటీవల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాంటా పూర్తయినా ధాన్యం సంచులు కల్లాల్లోనే ఉంటున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు రెండు మూడురోజులపాటు అక్కడే నిరీక్షిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ధాన్యం కుప్పల వద్దే ఉంటున్నారు. దానికి తోడు అకాల వర్షాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌ కొనుగోళ్లను తొలుత వేగంగా కొనసాగించారు. కాని గత పది రోజులుగా ప్రక్రియ మందగించింది. మిల్లుల్లో స్థలం లేదనే కారణంతో రైస్‌మిల్లర్లు లారీల్లోని ధాన్యాన్ని దించుకోవడం లేదు. 

సమీక్షలపై సందేహాలు

ధాన్యం కొనుగోళ్ల సీజన్‌ రాకముందే అధికారులు రెండు మూడుసార్లు అధికారిక సమీక్షలు నిర్వహిస్తారు. కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆయా సీజన్‌లో ధాన్యం దిగుబడులు ఎన్ని వస్తాయో ప్రాథమికంగా అంచనా వేస్తారు. అందుకు తగిన విధంగా రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలకు స్థలం ఉంది లేనిది చూస్తారు. మిల్లులు వారికి గతంలో కేటాయించిన ధాన్యానికి సీఎంఆర్‌ లక్ష్యాలు పూర్తిచేశారా లేదో ఆరా తీస్తారు. లక్ష్యాలు చేరుకోనివారికి కొత్తగా ధాన్యం కేటాయింపులు కూడా కొన్నిమార్లు ఇవ్వరు. ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ గిడ్డంగుల్లో నిల్వల పరిస్థితి గురించి ఆరా తీస్తారు. నిల్వలు ఎక్కువగా ఉంటే ఎఫ్‌సీఐ వారితో మాట్లాడి బియ్యాన్ని ఖాళీ చేయించడానికి కూడా ఏర్పాట్లు చేయాలి. మిల్లుల్లో స్థలం లేకుంటే పక్కజిల్లాకు కూడా ధాన్యం కేటాయింపులు జరుగుతుంటాయి. కానీ జిల్లాలో మాత్రం వీటిపై సమీక్ష జరిగిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల్లో గత సీజన్ల ధాన్యం, బియ్యం అలాగే ఉన్నాయి. ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం మూలుగుతున్నాయి. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. మిల్లులకు ధాన్యం అగ్రిమెంట్‌ చేసినప్పుడు ఒప్పుకొన్న మిల్లర్లు ఇప్పుడు స్థలం లేదంటూ సాకు చూపుతున్నారు. స్థలం లేనప్పుడు అధికారులు వారికి ఎలా ధాన్యం అగ్రిమెంట్‌ చేశారోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

టార్పాలిన్ల అద్దె భారం

అకాలవర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. టార్పాలిన్లను అద్దెకు తెచ్చుకుని ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సరిపడా రాకపోవడంతో రైతుల ధాన్యం తడిసిపోతుంది. దీంతో  రైతులే ఒక్కో టార్పాలిన్‌ను నిత్యం రూ.30కి అద్దెకు తెచ్చుకుంటున్నారు. తూకం వేసిన ధాన్యం వారాల తరబడి కల్లాల్లోనే ఉండడంతో టార్పాలిన్ల అద్దె భారాన్ని రైతులు భరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని