logo

కేజీబీవీలకు నిర్వహణ నిధులు

కస్తూర్బాగాంధీ విద్యాలయాల నిర్వహణకు సాధారణ ఖర్చుల భారం తప్పింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నెల నిధులను విడుదల చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published : 23 May 2024 02:13 IST

బకాయిల చెల్లింపులకు ఉత్తర్వులు జారీ
న్యూస్‌టుడే,కామారెడ్డి పట్టణం

కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని కేజీబీవీ

స్తూర్బాగాంధీ విద్యాలయాల నిర్వహణకు సాధారణ ఖర్చుల భారం తప్పింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నెల నిధులను విడుదల చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి నెలా కేజీబీవీలకు కేటాయించే నిర్వహణ నిధుల్లో అత్యధికంగా విద్యుత్తు బిల్లులు, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నారు. ఎట్టకేలకు బకాయి నిధులు విడుదల కావడంతో బాలికల విద్యాలయాలకు కాస్త ఊరట లభించినట్లయింది. ఉమ్మడి జిల్లాలోని 32 కేజీబీవీల్లో 7650 బాలికలు అభ్యసిస్తున్నారు. మొత్తంగా నిర్వహణ నిధులు 91.80 లక్షలు ఖాతాల్లో జమకానున్నాయి.

తగ్గనున్న ఆర్థిక భారం

కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులు మంజూరవుతాయి. కార్యాలయ సామగ్రి, అంతర్జాలం, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు సాధారణ నిధులను వెచ్చిస్తున్నారు. సకాలంలో నిధులు రాక ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. సుద్దముక్కల కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజుల్లో విద్యాలయాలు తెరుచుకోనున్న నేపథ్యంలో నిధుల విడుదలతో ఊరట కలగనుందని అధికారులు భావిస్తున్నారు. 

ప్రతి విద్యార్థినికి రూ.1200 చొప్పున

ఉమ్మడి జిల్లాలో బాలికల అక్షరాస్యత పెంచేందుకు కస్తూర్బాగాంధీ విద్యాలయాలను నెలకొల్పారు. ఆర్థికంగా చతికిలపడినవారు, అనాథ పిల్లలు, మధ్యలో బడి మానేసిన బాలికలకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన వసతి, సాయంత్రం అల్పాహారం, పాలు సరఫరా చేస్తున్నారు. వారంలో రెండుసార్లు గుడ్లు, కూరగాయలు, భోజనం కోసం ప్రతి విద్యార్థినిపై నెలకు రూ.1200 చొప్పున సర్కారు ఖర్చు పెడుతోంది. ఆహార మెనూకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ద్వారా సామగ్రిని సరఫరా చేస్తున్నారు. బాలికలకు రుచికరమైన భోజనం పెడుతుండటం, నాణ్యమైన విద్య అందిస్తుండటంతో ఏటా ప్రవేశాల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది. 


వసతుల కల్పనకు 
రాజు, డీఈవో-కామారెడ్డి

కేజీబీవీల్లో బకాయి నిర్వహణ నిధుల విడుదలకు ఉత్తర్వులు వచ్చాయి. త్వరలో ఈ నిధులు ఖాతాలో జమ కాగానే చిన్నపాటి వసతుల కల్పనకు చర్యలు చేపడతాం. ఈ సారి ప్రవేశాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాలికలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని