నోటీసివ్వండి.. కేసు పెట్టండి
సర్వీసు రిజిస్టర్ల వివాదంపై ఆగ్రహం
2014 ఉద్యోగులు కోర్టులో తేల్చుకోవాలి
పాలకమండలిలో కీలక నిర్ణయాలు
ఈనాడు, నిజామాబాద్
తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రూసా భవనంలో శనివారం జరిగిన సమావేశం వాడివేడిగా సాగింది. గత నెల 30న నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తొలుత చర్చించారు. వాటి అమలులో ఆలస్యంపై ప్రశ్నించడంతో పాటు వారంలోగా అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 2014లో నియమితులైన ఉద్యోగుల పదోన్నతుల అంశాన్ని ఈ సమావేశంలో తిరస్కరించారు. బాధితులు కోర్టులో తేల్చుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వీసు రికార్డులు బయటకు తీసుకెళ్లారనే ఆరోపణలపై పూర్వ రిజిస్ట్రార్ కనకయ్యకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ వ్యవహారంలో ఆధారాలుంటే కేసు కూడా పెట్టాలంటూ సూచించారు.
ఉద్యోగులకు శిక్షణ.. పరీక్ష
వర్సిటీలోని జూనియర్ అసిస్టెంట్లు, ప్రోగ్రామర్లలో చాలావరకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. వారికి నెలరోజుల శిక్షణ ఇప్పించి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తాత్కాలిక అధ్యాపకులు సరిపడా ఉన్నారని.. పనిభారం ఉన్న విభాగాలను గుర్తించి అవసరమైతే అనుమతి తీసుకోవాలన్నారు. పరీక్షల విభాగంలో వేగవంతమైన సేవలు అవసరమని తేల్చారు.
ఆలస్యంపై నిలదీత..
గత సమావేశంలో అకడమిక్ కన్సల్టెంట్లు, పొరుగు సేవల ఉద్యోగుల వేతన సవరణ, ఎరియర్స్ చెల్లింపునకు అనుమతులిచ్చారు. వీటి అమలులో ఆలస్యంపై అధికారులను పాలకమండలి సభ్యులు నిలదీశారు. అవసరమైన దస్త్రాలపై వెంటనే సంతకాలు పెట్టాలని సూచించారు. పొరుగు సేవల ఉద్యోగులకు మూడు కేటగిరీల్లోనే వర్తింపచేయాలని, ఇతర కేటగిరీల కిందకు రారని చెప్పారు. పూర్వ రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి కొత్తవి వారం రోజుల్లోగా ఇచ్చేలా చూడాలని ఉపకులపతి రవీందర్ గుప్తాకు సూచించారు.
వివాదంపై చర్ఛ.
ముగ్గురు ఉద్యోగుల సర్వీసు రికార్డులు పూర్వ రిజిస్ట్రార్ తీసుకెళ్లిన విషయంపై చర్చించారు. వాటి నకళ్లు కరపత్రాల రూపంలో బయటకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు బయటకు తీసుకెళ్లారనే ఆరోపణలపై విచారణ చేయాలన్నారు. పూర్వ రిజిస్ట్రార్‌కు నోటీసు జారీ చేసి సంజాయిషీ అడగాలన్నారు. ఈ వివాదంలో ఆధారాలకు అనుగుణంగా కేసు పెట్టేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ యాదగిరికి కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిత్తల్ సూచించారు.
కమిటీల ఏర్పాటుకు నిర్ణయం