నందిపేట్ ఎంపీడీవోపై చర్యలకు ఆదేశాలు
నందిపేట్ గ్రామీణం : నందిపేట్ ఎంపీడీవో నాగవర్ధన్పై రాష్ట్ర సమాచార కమిషనర్ చర్యలకు ఆదేశించారు. సకాలంలో అడిగిన సమాచారం ఇవ్వనందుకు ఓ ఏడాది ఇంక్రిమెంట్ రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు సూచించారు. మండలంలోని తల్వేదలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని దీనిపై విచారణ జరపాలని గ్రామస్థులు నాలుగేళ్ల కిందట ప్రజావాణిలో వినతిప్రతం అందించారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధి, అధికారుల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ఫించన్ల మంజూరులోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులొచ్చాయి. దీనిపై సమగ్ర సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా లోక సాయారెడ్డి, నరేశ్‌గౌడ్, రమణ విన్నవించారు. అధికారులు సకాలంలో స్పందించలేదని, అసమగ్రంగా సమాచారం ఇచ్చారని ఆర్టీఏ కార్యకర్తలు జడ్పీ సీఈవో, కలెక్టరేట్, సమాచార హక్కు కమిషనర్‌కు విడతల వారీగా ఫిర్యాదు చేశారు. నవంబర్ 29న కమిషనర్‌కు మళ్లీ విన్నవించగా.. ఎంపీడీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు.
వైద్యురాలి తీరుపై జిల్లా అధికారికి ఫిర్యాదు
ఆర్మూర్, న్యూస్‌టుడే: ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు, గైనకాలజిస్టు పనితీరుపై ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ నాగరాజు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి ఇటీవల ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సిమాంక్ వైద్యాధికారిణిగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఆమె విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, రోగులతో పాటు పైఅధికారులతోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లారని శాఖ వర్గాలు తెలిపాయి.