logo
Published : 02/12/2021 06:22 IST

నిబంధనలు ఎరుకే.. గదులే ఇరుకు

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ప్రభుత్వ బడులు పిల్లలతో కళకళలాడుతున్నాయి. భారీగా ప్రవేశాలు పెరగడంతో తరగతులు నిండుగా కనిపిస్తున్నాయి. బడులు మళ్లీ మూసివేస్తారనే అసత్య ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు చాలావరకు తగ్గాయి. ఒకట్రెండు కేసులు మినహా అందరికి నెగెటివ్‌ వస్తోంది. కానీ ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు కొనసాగించాలని వైద్యశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.

కొరవడిన పర్యవేక్షణ

జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన తరగతులు నిర్వహిస్తున్నాయి. తరగతి గదిలో కొవిడ్‌ నిబంధనలు విస్మరిస్తున్నారు. పలువురు విద్యార్థులు మాస్కు లేకుండానే వస్తున్నారు. మరికొంత మంది వచ్చాక తీసేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండటం లేదు. పిల్లలంతా ఒకచోట చేరి కాలక్షేపం చేస్తున్నారు.

తల్లిదండ్రులు బాధ్యత గుర్తెరగాలి

కొవిడ్‌ ప్రబలకుండా చేయడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర కీలకం. బడికి పంపేటప్పుడు జాగ్రత్తలు వివరించాలి. తరగతి గదిలో మాస్కు తీయొద్దని సూచించాలి. వీలైతే శానిటైజర్‌ ఇచ్చి పంపాలి. బడి నుంచి ఇంటికి వచ్చాక వేడినీటితో స్నానం చేసేలా జాగ్రత్త వహించాలి.

జిల్లాలో విద్యార్థులు

పాఠశాలల్లో : 93,542

గురుకులాలు, ఇతర విద్యాలయాల్లో: 32,120

మొత్తం బడులు : 1011


స్వచ్ఛ కార్మికులు లేక ఇక్కట్లు

పాఠశాలల్లో స్కావెంజర్లను తొలగించడంతో పారిశుద్ధ్య నిర్వహణ సమస్యగా మారింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయడం తలనొప్పి వ్యవహారమైంది. తరగతి గదులను సక్రమంగా ఊడ్చడం లేదు. వాస్తవానికి పిల్లలు కూర్చునే గదులను ఎప్పటికప్పుడు హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. పిల్లలకు తరచూ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపట్టాల్సిన ఉన్నా పరికరాలు సమకూర్చలేదు.


అంతా ఒకేచోట

జిల్లాకేంద్రంలోని గంజ్‌ ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఏళ్ల నాటి భవనాల్లో కాలం వెళ్ల దీస్తున్నారు. ఇరుకు గదుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులంతా ఒకే చోట కూర్చుంటున్నారు. గదులు లేక తామేమీ చేయలేకపోతున్నామని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. ఉదయం పూట పిల్లలు బడికి రాగానే శానిటైజర్‌ వేస్తున్నారు.


రెండింట్లో112 మంది

జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంట ప్రాథమిక పాఠశాలలో గతంలో 27 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 112 మంది ఉన్నారు. నాలుగు రెట్లు పెరిగినా వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రెండే గదుల్లో పిల్లలందరిని కూర్చోబెడుతున్నారు. ఇద్దరే ఉపాధ్యాయులు అందరిని చూసుకోవాల్సి వస్తోంది.


శానిటైజర్‌ లేదు

జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులున్నారు. సరిపడా తరగతి గదులు లేవు. ఈసారి ప్రైవేటు నుంచి 120 మంది చేరారు. బడిలో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. భౌతికదూరం పాటించడం లేదు. శానిటైజర్‌ అందుబాటులో ఉంచడం లేదు.


పరీక్షలకు చర్యలు తీసుకుంటాం

- రాజు, డీఈవో, కామారెడ్డి

తరగతి గదికి వెళ్లే ముందు విద్యార్థుల కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. ప్రతిఒక్కరు మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలి. కరోనా లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఎక్కువ మంది విద్యార్థులున్న చోట వైద్యశాఖ ఆధ్వర్యంలో కొవిడ్‌ పరీక్షలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని