logo
Published : 03/12/2021 03:18 IST

చరవాణిలో... దొంగలు పడ్డారు

విద్యార్థుల చక్కని సందేశం

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

విద్యార్థులు చదువులోనే కాకుండా సామాజిక అంశాల్లోనూ నైపుణ్యాలు పెంచుకొనే విధంగా విద్యాశాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో రోల్‌ప్లే పోటీలూ ఉన్నాయి. ఇవి వారి జ్ఞానాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ఇటీవల నిర్వహించిన పోటీల్లో సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న మోసాలను కళ్లకు కట్టారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, కేజీబీవీ 8, 9 తరగతుల విద్యార్థులు భాగస్వాములయ్యారు.

సంపూర్ణ ఆరోగ్యంలో పౌష్టికాహారం పాత్ర.. శారీరక, మానసిక అంశాల్లో స్వీయ భద్రత.. అంతర్జాల సక్రమ వినియోగం(డిజిటల్‌ లిట్రసీ, సైబర్‌ సేఫ్టీ).. అంశాలపై ఇటీవల ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో మల్కాపూర్‌(ఎం) పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారు. వీరికి త్వరలో డీఈవో దుర్గాప్రసాద్‌ ప్రశంసాపత్రాలు అందించనున్నారు.

* అంతర్జాల సక్రమ వినియోగం.. దానిపై అవగాహన అనే అంశంపై అంతర్జాలం ద్వారా ఆరు నిమిషాలకు మించకుండా ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. చరవాణి వినియోగం అదుపు తప్పితే కలిగే నష్టాలు ప్రదర్శనలో చూపించారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ జరుగుతున్న సైబర్‌నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్జాల కేటుగాళ్లు డబ్బులు దోచుకోవడానికి తప్పుడు లింకులు పంపిస్తారని వాటి విషయంలో జాగ్రత్త ఉండాలని సందేశం ఇచ్చారు. చరవాణిలో ఆడే గేమ్స్‌తో ఎలా పిచ్చోళ్లు అవుతున్నారో ప్రదర్శించారు. మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి..బ్యాంకు ఖాతాల విషయంలో భద్రత పాటించాలని వివరించారు.

రోల్‌ప్లే ప్రదర్శిస్తున్న విద్యార్థులు


అవగాహన వచ్చింది

- ఎల్‌ సౌజన్య

చరవాణి అంటే కేవలం మాట్లాడటం, ఆటలాడటం మాత్రమే అనుకున్నాం. దీని వాడకం ఇంత ప్రమాదకరమని అవగాహన వచ్చింది. చరవాణిలోనూ దొంగలు పడతారని అర్థమైంది. అవసరమైన సమాచారాన్ని తీసుకొని అనవసర విషయాలకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నాం.


వినియోగం పెరిగింది

- గోపాలకృష్ణ, గైడ్‌టీచర్‌

వయసులో తేడా లేకుండా ప్రతిఒక్కరు చరవాణి వినియోగిస్తున్నారు. సాంకేతిక విప్లవం మంచిదే. దాన్ని దుర్వినియోగం చేస్తే మొదటికే మోసం వస్తుంది. మానసిక, ఆర్థికంగా కుంగదీస్తుంది. దీన్ని అవసరంగానే కానీ వ్యసనంగా మార్చుకోవద్దని రోల్‌ప్లేలో ప్రదర్శించాం. విజయం సాధించాం. జాతీయస్థాయిలోనూ విజేతలుగా నిలుస్తామని నమ్మకం ఉంది.


రోల్‌ప్లేలో పాల్గొన్న తొమ్మిదో తరగతి విద్యార్థులు

ప్రవీణ్‌కుమార్‌, శ్రావణి, సౌజన్య, సందీప్‌, రాజేశ్వరి, గైడ్‌ టీచర్‌ గోపాలకృష్ణ


 

 

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని