logo
Published : 09/12/2021 03:43 IST

శ్రద్ధ లేదు ఏమాత్రం

సర్కారీ దవాఖానాల్లో మందుల కొరత
ప్రైవేటు బాట పడుతున్న రోగులు

ఉమ్మడి జిల్లాలోని ఆసుపత్రుల్లో కొన్ని మందులు దొరకడం లేదు. ఉన్నవి ఇస్తాం.. మిగతావి బయట తీసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా రోగులపై ఆర్థిక భారం పడుతోంది. ‘న్యూస్‌టడే’ బృందం బుధవారం చేసిన పరిశీలనలో ఎక్కువగా శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించే సామగ్రి,  యాంటిబయాటిక్స్‌, మత్తుమందు కొరత ఉన్నట్లు వెల్లడైంది.


ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో పిల్లలకు యాంటీబయాటిక్స్‌ కొరత ఉంది.  డెరిఫైలిన్‌ సూది మందు లేదు.  
280-300 మంది ఓపీ వస్తుంటే 40-60 మందికి బయటకు చీటీలు రాసి ఇస్తున్నారు.

పేదలకు వైద్యం ఇలాగేనా?
..పండరి, ఎల్లారెడ్డి

నా కూతురికి జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకొచ్చాను. వైద్యుడు 6 రకాల ఔషధాలు రాయగా 3 మాత్రమే దవాఖానాలో ఇచ్చారు.  మిగతావి ప్రైవేటు ఔషధ కేంద్రాల్లో కొన్నాను.


బోధన్‌లో..

బోధన్‌లో రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

బోధన్‌ ఆసుపత్రిలో ఓపీ 450, ఐపీ 60గా నమోదైంది. కొలెస్ట్రాల్‌ తగ్గించే అఫ్రావాస్టిన్‌ నవంబరు మాత్రలు గడువు తీరాయి. డిసెంబర్‌లో ఇచ్చేవి సరఫరా కాలేదు. నెలకు 300-400 మాత్రలు కావాలి.
రక్తపోటు స్థాయి ఆధారంగా టెల్మిసార్టన్‌ మాత్రలు 40, 20 మి.గ్రా మోతాదుల్లో వాడతారు. ఇక్కడ 40 మి.గ్రా మాత్రలు లేకపోవడంతో 20 మి.గ్రావి రెండు వాడాలని సూచిస్తున్నారు. నెలకు 40 మి.గ్రా అయితే 3-4 వేలు, 20 మి.గ్రా 8 వేల మాత్రలు అవసరం అవుతాయి.
మత్తుమందు, కుట్లు వేయడానికి ఉపయోగించే సామగ్రి లేదు. అత్యవసర పద్దులో కేటాయించే రూ.30 వేల త్రైమాసిక బడ్జెట్‌ నుంచి కొనుగోలు చేస్తున్నారు. 

‘సీడీసీ నుంచి వచ్చిన మాత్రలు రోగులకు అందజేస్తున్నాం. శస్త్రచికిత్సలకు అత్యవసరమైనవి కొరత ఉంటే మార్గదర్శకాలకు లోబడి కొనుగోలు చేస్తున్నామని’ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆశిష్‌ రాండర్‌ తెలిపారు.  

- బోధన్‌ పట్టణం


బాల్కొండలో..

బాల్కొండ సీహెచ్‌సీలో ప్రసవాల కోసం వచ్చేవారే బయట మత్తు ఇంజెక్షన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కుట్లు వేసే సామగ్రి కూడా ఆసుపత్రి నుంచి రావట్లేదు.

ప్రసవాల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా మందుల సరఫరాపై దృష్టి పెట్టట్లేదు.

- బాల్కొండ

బాన్సువాడలో ప్రైవేటు మెడికల్‌లో కొంటూ...

బయటకు పంపించారు
..రమేశ్‌, పాత బాన్సువాడ

బాన్సువాడ పట్టణం: గతంలో మా బాబుకు చెయ్యికి గాయాలయ్యాయని బాన్సువాడ ప్రాంతీయాసుపత్రికి తీసుకొస్తే బయటకు పంపించారు. నోట్లో పుండ్లు అయ్యాయని బుధవారం వస్తే జెల్‌ అందుబాటులో లేదన్నారు. ఇక్కడే అన్ని మందులు అందుబాటులో ఉంచేలా చూడాలి.


ఆర్మూర్‌లో..

ప్రైవేటు ఔషధ దుకాణంలో చేతికి వేసుకొనే పట్టి కొంటున్న రాజు

ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రి ఇటీవల వైద్యవిధాన పరిషత్‌ అధీనంలోకి వచ్చినా స్థాయికి తగ్గట్లు ఔషధాల బడ్జెట్‌ పెరగలేదు. పాత బడ్జెట్‌ ప్రకారమే మూడునెలలకోసారి సరఫరా అవుతున్నాయి. ఓపీ 126, ఐపీ 7గా నమోదు కాగా 8 ప్రసవాలు జరిగాయి.  
శస్త్రచికిత్సలకు సంబంధించిన మత్తు ఇంజెక్షన్లు, ఇతర సామగ్రి కొన్ని నెలలుగా రావడం లేదు. ఆర్థోపెడిక్‌, బాలింతలు, పిల్లల చికిత్సకు సంబంధించిన ఔషధాలు, ఆయింట్‌మెంట్లను రోగులు ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నారు.
ఆర్మూర్‌కు చెందిన రాజు చేయి ఫ్యాక్చర్‌ అయిందనే అనుమానంతో వస్తే ఎక్స్‌రే సదుపాయం లేదు. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్‌ ఇచ్చారు. ఆయింట్‌మెంట్‌ బయట తీసుకోమన్నారు.
‘శస్త్రచికిత్సకు సంబంధించిన కొంత సామగ్రి సరఫరా కావడం లేదు. అందుకోసం ఇండెంట్‌ పెట్టామని’ సూపరింటెండెంట్‌   నాగరాజు  తెలిపారు.

- ఆర్మూర్‌


కామారెడ్డిలో..

కామారెడ్డి ఆసుపత్రిలో వరుసలో నిల్చున్న రోగులు

నిత్యం వెయ్యి మందికిపైగా ఓపీ కోసం వస్తుంటారు. దగ్గు, దమ్ము, జ్వరం, ఒంటినొప్పులతో సతమతమయ్యేవారు అధిక సంఖ్యలో చికిత్సకు వస్తారు. అంటువ్యాధుల బారిన పడిన వారికి యాంటిబయాటిక్స్‌ కూడా లేవు. నొప్పి నివారణతో పాటు ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ మాత్రలు లేవు.

జిల్లా ఆసుపత్రితో పాటు పట్టణ ఆరోగ్యకేంద్రంలో మందుల కొరత కారణంగా రోగులకు చీటీలు రాసి చేతిలో పెడుతున్నారు.

అడ్రిలిన్‌ 1ఎంజీ, అట్రోపైన్‌ సల్ఫేట్‌, మిడాజోలమ్‌, పొటాషియం క్లోరైడ్‌, ఎర్తిరోపొయిటిన్‌, మిథైల్‌గోమాట్రిన్‌, పెన్రాజోసిన్‌, ప్రొపొఫోల్‌, అమాక్సిలిన్‌ 250 ఎంజీ, 500 ఎంజీ, పాంటప్రజోల్‌ 40 ఎంజీ, రాంటడిన్‌ 150 ఎంజీ, కాల్షియం (సిరప్‌), బ్లడ్‌ షుగర్‌ స్ట్రిప్స్‌, సిరంజీలు లేవు.  

- కామారెడ్డి వైద్యవిభాగం


నిజామాబాద్‌లో..

నిజామాబాద్‌ దవాఖానాలో వైద్యులు రాసిన చీటీలో ఒక్కటీ లేదని పెన్నుతో సున్నాలు చుట్టారిలా..

ఓపీ 1200, ఐపీ 90 వరకు నమోదవుతోంది. 220 మంది వైద్యులు ఉన్నారు. జనరల్‌ ఫిజీషియన్‌లో 8 నుంచి 10, మానసిక విభాగంలో 5 నుంచి 10, చెవి, ముక్కు, గొంతు విభాగాల్లో రెండు రకాల మందుల కొరత ఉంది. కొన్ని మందులు వైద్యులు రాస్తున్నా వాటిని ఆసుపత్రికి సరఫరా చేయట్లేదు. వైద్యులు ఐదు మాత్రలు రాస్తే అందులో రెండు బయట కొన్నాల్సి వస్తోంది.

పాతరకమే కారణం..  బీపీకి కొన్నేళ్ల క్రితం పాతరకమైన మాత్ర టెల్మా ఉండేది. ఇందులో టెల్మాహెచ్‌, సార్టెల్‌ ఏఎం రకాలు అందుబాటులో ఉన్నాయి. యువ వైద్యులు మార్కెట్‌లోకి వచ్చినవి రాస్తుంటే అవి కాస్త దవాఖానాలో ఉండట్లేదు. కొవిడ్‌ సమయంలో ఎక్కువగా అవసరమైన మోటెక్స్‌-ఎస్‌సీ, సిఫేక్సిమ్‌ 200ఎంజీ వంటివి ఆరు నెలలుగా లేవు. అమోక్సిలిన్‌, సిప్రాప్లాక్సిన్‌ యాంటిబయాటిక్‌ 500 ఎంజీలు కూడా సరఫరా కావట్లేదు. వాటికి బదులు వేరేవి ఇస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని