logo

విలువ పెంపుతో రెట్టింపు ఆదాయం

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల విలువ పెంచనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వస్తాయని సమాచారం. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. ప్రభుత్వానికి 50 శాతం రెట్టింపు

Published : 23 Jan 2022 04:19 IST

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల విలువ పెంచనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వస్తాయని సమాచారం. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. ప్రభుత్వానికి 50 శాతం రెట్టింపు ఆదాయం రానుంది. మరోవైపు విక్రయదారులపైనా అదనపు భారం పడనుంది. దీంతో కొందరు నెలాఖరులోగా దస్తావేజులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు.

* గతేడాది జులైలోనే ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను సవరించింది. ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీ విలువలను నిర్ధారించి ప్రభుత్వానికి సిఫార్సు చేయగా ఆమోదముద్ర పడింది. తిరిగి ఇదే తరహాలో అన్ని భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిజామాబాద్‌, కామారెడ్డిలోని పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించారు. ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వ్యవసాయ భూముల విలువల నివేదికను సైతం పరిశీలిస్తున్నారు.

నిజామాబాద్‌లో అత్యధికం
వ్యవసాయ భూముల విలువ నిజామాబాద్‌లో ఎకరాకు రూ.50 లక్షలు-రూ.కోటి వరకు ఉంది. వ్యవసాయేతర భూములకు సంబంధించి గజం రూ.2,750- రూ.35 వేల వరకు మార్కెట్‌ విలువ ఉంది. అదనంగా 35 శాతం మేర మార్కెట్‌ విలువ పెరిగే అవకాశం ఉంది. దీంతో పలుచోట్ల గజం రూ.50 వేలు దాటనుంది.

వ్యత్యాసంతోనే..
ప్రస్తుతం న్యాల్‌కల్‌ రోడ్డులో వ్యవసాయ భూమి ప్రభుత్వపరంగా ఎకరాకు రూ.కోటికి పైగా ఉంది. కానీ, ఇక్కడ బహిరంగ మార్కెట్‌ విలువ కాస్త తక్కువగా ఉంది. కొత్త కలెక్టరేట్‌ శివార్లలో బహిరంగ మార్కెట్‌ విలువ గజానికి రూ.50 వేల వరకు ఉంది. వీటి విలువ ప్రభుత్వపరంగా చాలా తక్కువగా ఉంది. ఈ వ్యత్యాసాలను సవరించాల్సిన అవసరం ఉంది.

* వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఇతర ఆస్తుల మార్కెట్‌ విలువల పెంపు ద్వారా ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆదాయం పెరుగనుంది. రిజిస్ట్రేషన్‌, నాలా ఛార్జీలు, స్టాంపుల రుసుములు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉభయ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల ద్వారా ఏటా రూ.150 కోట్ల రాబడి లక్ష్యం ఉంది. ఇది కాస్త రూ.200 కోట్లు దాటనుంది. ధరణి ద్వారా జరుగుతున్న లావాదేవీల ద్వారా అదనంగా ఏటా రూ.40 కోట్ల పైబడి ఆదాయం సమకూరే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని