logo

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం : మంత్రి

కొవిడ్‌ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం వైద్యశాఖ పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా కట్టడి చర్యలు, దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్‌లో

Published : 23 Jan 2022 04:26 IST


సమీక్షలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు

ఈనాడు, నిజామాబాద్‌: కొవిడ్‌ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం వైద్యశాఖ పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా కట్టడి చర్యలు, దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 946 ఆక్సిజన్‌ పడకలు, ప్రైవేటులో మరో 2200 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీజీహెచ్‌లోనే 119 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో కేసులు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దవాఖానాల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 48 మంది చేరగా వీరిలో 15 మందికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరం ఏర్పడిందన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని.. అలా అని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. గుమిగూడటం, విందులు చేసుకోవడం తగ్గించాలని సూచించారు.

సమన్వయం అవసరం  : జిల్లాలో రెండో డోసు టీకా పంపిణీ నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిగా చెప్పారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసుశాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్య లక్షణాల ఆధారంగా నాలుగు విధానాలుగా నివేదికలు రూపొందించాలన్నారు. ఇంటి వద్ద తగ్గని వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలించాలన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 3.66 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉంచామని.. నిత్యం 1500కు పైగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.

దళితబంధులో ఆదర్శంగా నిలవాలి : జిల్లాలో దళితబంధును సమర్థంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి పేర్కొన్నారు. తొలి విడతలో భాగంగా మార్చి నెలాఖరుకు నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌, సాంఘిక సంక్షేమాభివృద్ధి శాఖలతో పాటు వ్యవసాయం, ఉద్యాన, పాడి, పరిశ్రమల శాఖలు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. యూనిట్‌ వ్యయంతో సంబంధం లేకుండా వ్యాపారాలు సూచించాలన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌ నాగరాజు, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  


కొవిడ్‌పై ఆందోళన అక్కర్లేదు.. అప్రమత్తత చాలు
దళితబంధు విజయవంతానికి అన్నిశాఖల తోడ్పాటు అవసరం

సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జడ్పీ అధ్యక్షురాలు శోభ, డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి  

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం కొవిడ్‌ నియంత్రణ, దళితబంధు అమలుపై ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొదటి, రెండో దశలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి ప్రాణనష్టం పెరగకుండా చర్యలు చేపట్టిందన్నారు. అదే స్ఫూర్తితో మూడో దశను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పీహెచ్‌సీలతో పాటు ఉపకేంద్రాల్లో 1,81,000, జిల్లా కేంద్రంలో 31 వేల ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రెండు రోజులుగా 1,12,345 ఇళ్లకు వెళ్లి 2,714 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారన్నారు. ప్రజలు మరో 15 రోజుల పాటు విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 337 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. విప్‌ మాట్లాడుతూ.. పల్లెల్లో ఆరోగ్య సర్వే పకడ్బందీగా జరుగుతున్నప్పటికీ పురపాలికల్లో నామమాత్రంగా ఉందన్నారు. సర్వే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని పేర్కొన్నారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ దళితబంధు పథకం అమల్లో లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికే కీలకమన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 350 మందిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ శోభ, డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి పురపాలక సంఘం వైస్‌ఛైర్మన్‌ ఇందుప్రియ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని