logo

చేరికలపై హస్తం పార్టీ దృష్టి

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

Updated : 27 Apr 2024 06:42 IST

ఈనాడు, కామారెడ్డి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జహీరాబాద్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లినవారిని, ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటోంది.

ఓటమి చెందిన నియోజకవర్గాల్లో..

జహీరాబాద్‌ లోకసభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాలుండగా.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్‌, అందోల్‌, నారాయణఖేడ్‌లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కామారెడ్డి, బాన్సువాడ, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఓటమి చెందింది. ప్రస్తుతం ఓటమి చెందిన స్థానాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఇందులో భాగంగా వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కమిటీలను నియమించారు. బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలు పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తోంది. పీసీసీ నాయకత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గ, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట కామారెడ్డి నియోజకవర్గంలో భారాస, భాజపాలకు చెందిన ముఖ్యనేతల వద్దకు డీసీసీ ప్రతినిధి బృందం వెళ్లి ఆహ్వానించింది. ఇదే మాదిరి బాన్సువాడ, జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

అధిష్ఠానం నిర్దేశించడంతో..

లోకసభ స్థానంలో పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న పీసీసీ నాయకత్వం చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి చేరికను స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించినప్పటికీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. దీంతో రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో సుభాష్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకొన్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు సైతం చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ఇన్నాళ్లు చేరికలు ఆగాయి. ప్రస్తుతం పీసీసీ నిర్దేశించడంతో బాన్సువాడ, కామారెడ్డిలతో పాటు ఇతర  నియోజకవర్గాల్లో చేరికలు ఊపందుకోనున్నాయి. కామారెడ్డిలో ఇటీవలి వరకు భారాసలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు సైతం హస్తం కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని