logo

ఎండలతో ఆలస్యంగా సమావేశాలు

ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 27 Apr 2024 03:17 IST

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం: ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. భగభగ మండుతున్న ఎండలు ఎన్నికల ప్రచార సరళిని నిలువరిస్తున్నాయనే చెప్పాలి. నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. తర్వాత అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. బుధ, గురువారాల ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులు మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఇవి ఉదయం, సాయంత్రం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలు అనుకున్న సమయం దాటి అరగంట అయినా ఎవరూ రాలేదు. దీంతో నాయకులు ఏమైందని ఆరా తీస్తే ‘సార్‌ ఎండలు బాగున్నాయి నాలుగు తర్వాతనే గ్రామాల నుంచి బయల్దేరుతాము’ అని చెప్పారని ద్వితీయశ్రేణి నాయకులు వెల్లడించారు. దీంతో అనుకున్న సమయానికి రెండు గంటలు ఆలస్యంగా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. పైగా ఈ సమావేశాల్లో వాతావరణానికి తగ్గట్టుగా కార్యకర్తలకు చాయ్‌ బదులు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు ఆయా నియోజకవర్గబాధ్యులు, మండల స్థాయి నాయకులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు ఒక్కోసారి సాయంత్రం కాగానే గాలి, వానల దృష్ట్యా సమావేశాలు రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని