logo

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌

మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు.

Updated : 27 Apr 2024 06:46 IST

జనజాతర సభలో కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం

అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

పెద్దశంకరంపేట, నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా సురేష్‌షెట్కార్‌ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీహెచ్‌ఈఎల్‌, ఐడీపీఎల్‌, ఈసీఐఎల్‌ వంటి పరిశ్రమలు స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటితో స్థానికంగానే కాకుండా రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందన్నారు.

సభావేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు రాములునాయక్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి  

అందుబాటులో ఉండే నేతకు పట్టం కట్టాలి

ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే సురేష్‌షెట్కార్‌ను ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆయనకు కేటాయిస్తే,  పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంజీవరెడ్డికి త్యాగం చేశారని కొనియాడారు. సంజీవరెడ్డి అయితేనే విజయం సాధిస్తారని గ్రహించడంతోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో షెట్కార్‌ ఈ పని చేశారని పేర్కొన్నారు. త్యాగం చేసిన ఆయన విజయానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు శ్రమించాలని కోరారు.

అంచనాకు మించి హాజరైన జనం

సభకు హాజరైన కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు, ప్రజలు

జనజాతర సభకు అంచనాలకు మించి కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ నేతలు సమావేశంలో మాట్లాడారు. ఎంపీ బీబీపాటిల్‌ పదేళ్ల కాలంలో నియోజకవర్గానికి ఏం చేయలేదని, సంగారెడ్డి-నాందేడ్‌-అకోల(ఎస్‌ఎన్‌ఏ) జాతీయ రహదారి తన పదవీ కాలంలోనే మంజూరైనప్పటికీ బీబీపాటిల్‌ తాను మంజూరు చేయించినట్లు చెప్పుకొంటున్నారని సురేష్‌ షెట్కార్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా గతంలో కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను సభలో ప్రదర్శించారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ మాట్లాడారు. నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు

హామీలు నెరవేర్చే సత్తా పార్టీకి ఉంది

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

దేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోపే అమలు చేశామని చెప్పారు. 30 వేల ఉద్యోగాలు ఇవ్వగా, ఇంకా 2లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన, మహిళకు 50 శాతం రిజర్వేషన్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు వేతనాలు పెంపు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సోనియాగాంధీ సాకారం చేయగా, తొమ్మిదిన్నరేళ్ల కేసీˆఆర్‌ కుటుంబ పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పులతోపాటు, అన్ని వర్గాల వారికీ అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను కాలరాయడానికే భాజపా 400 సీట్లు కోరుకుంటోందని దుయ్యబట్టారు. భాజపా గెలిస్తే సమాజం ప్రమాదంలో పడుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆలోచించుకోవాలన్నారు.

జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌షెట్కార్‌ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో సోనియాగాంధీని ఒప్పించి, మెప్పించి తెలంగాణ బిల్లు పాస్‌ చేయించడంతో తన పాత్ర ఉందన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో నిమ్జ్‌ తన హయాంలోనే మంజూరైందన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగునెలలే అయ్యిందన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పట్టించుకోకుండా సీఎం కుటుంబ సభ్యులపై ఒట్టేయాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఆగస్టు వరకు ఆగలేరా అని ప్రశ్నించారు. కారు స్పీడున్నప్పుడు బీబీ పాటిల్‌ అందులో ఉండి.. కారు డ్యామెజ్‌కాగానే కమలం దరి చేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సురేష్‌షెట్కార్‌ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, మాజీ మంత్రులు చంద్రశేఖర్‌, యూసూఫ్‌అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు ఉజ్వల్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని