logo

అగ్నివీరుల ఆనందం

సైన్యంలో చేరి దేశాన్ని రక్షించే అవకాశం కొద్దిమందికే వస్తుంది. అంకితభావంతో పనిచేస్తూ సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది.

Published : 30 Jan 2023 03:04 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, నాగిరెడ్డిపేట, బీబీపేట

సైన్యంలో చేరి దేశాన్ని రక్షించే అవకాశం కొద్దిమందికే వస్తుంది. అంకితభావంతో పనిచేస్తూ సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం ఎంపిక విధానం మార్చిన నేపథ్యంలో అగ్నివీరులుగా మారాలంటే అంత సులువు కాదు. తొలిసారిగా నిర్వహించిన పరీక్షల్లో జిల్లాకు చెందిన యువత సత్తాచాటడంతో వారి కుటుంబాలు, గ్రామాల్లో సంతోషం నెలకొంది.

రెండేళ్లుగా నిరీక్షణ

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్మీ ప్రవేశ ర్యాలీల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం రెండేళ్లపాటు నిలిపివేసింది. సైన్యంలో చేరాలనుకునే వేలాది మంది యువత అసంతృప్తికి లోనయ్యారు. అర్హత సాధించేందుకు రాష్ట్ర రాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటూ శిక్షణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక విధానాన్ని మార్చి అగ్నివీరులుగా తీసుకుంటామని ప్రకటించింది. దీనిపట్ల వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అర్హత పరీక్షకు వేలాది మంది యువత హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

జిల్లాలో 40 మంది వరకు

పూర్వం ఆర్మీ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాంతం తిరుగుండేది కాదు. ప్రస్తుత విధానంలో అగ్నివీరులుగా ఎంపికైన వారు నాలుగేళ్లపాటు సేవలందించి ఉత్తమ ప్రతిభకనబరిస్తేనే సైన్యంలో కొనసాగుతారు. ఈ విధానంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన సంఘటనలో జిల్లాకు చెందిన యువకులు పాత్ర ఉందనే ఉద్దేశంతో పలువురిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల మధ్య జరిగిన పరీక్షలో జిల్లా నుంచి సుమారు 40 మంది యువకులు ఎంపికయ్యారు. నాగిరెడ్డిపేట మండలంలో నలుగురు, బీబీపేటలో ముగ్గురు, విలీన గ్రామం చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి పట్టణం నుంచి ముగ్గురు చొప్పున అర్హత సాధించారు.

దేశ సేవ చేసే అదృష్టం
- నవీన్‌కుమార్‌, జలాల్‌పూర్‌, నాగిరెడ్డిపేట

అగ్నివీర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అదృష్టం లభించింది. ఆర్మీ నిబంధనల మేరకు ఉత్తమ ప్రతిభకనబరిచి సైన్యంలోకి ప్రవేశించాలనేది కోరిక. అంచెలంచెలుగా ఎదిగి జిల్లాకు పేరు తీసుకొస్తాను.

గర్వంగా ఉంది
- దుర్గయ్య, జలాల్‌పూర్‌, నాగిరెడ్డిపేట

తొలిసారిగా నిర్వహించిన అగ్నివీర్‌ పరీక్షలో అర్హత సాధించడం గర్వంగా ఉంది. మెరుగైన పనితీరుతో దేశానికి సేవలందించడమే నా ఆశయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని