logo

సిఫారసులు పదుల్లో.. ఒక్కటే అంబులెన్సు..

అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం, వైద్యనిపుణుల కొరత కారణంగా జిల్లా ఆసుపత్రి నుంచి అధిక శాతం రోగులను నిజామాబాద్‌, హైదరాబాద్‌కు సిఫారసు చేస్తున్నారు.

Published : 24 Mar 2023 06:24 IST

జిల్లా ఆసుపత్రిలో రోగుల దీన పరిస్థితి 
ప్రైవేటు వాహనాలకు రూ.వేలు వసూలు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఆవరణలో ప్రైవేటు అంబులెన్సులు

త్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం, వైద్యనిపుణుల కొరత కారణంగా జిల్లా ఆసుపత్రి నుంచి అధిక శాతం రోగులను నిజామాబాద్‌, హైదరాబాద్‌కు సిఫారసు చేస్తున్నారు. కనీసం వారిని తరలించేందుకు సరిపడా అంబులెన్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో వేల రూపాయలు చెల్లించి ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

రోజూ పదుల్లో తరలింపు

జిల్లా ఆసుపత్రి నుంచి రోజుకు పదుల సంఖ్యలో రోగులను నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌కు సిఫారసు చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో రోజుకు 50 మందికి పైగా రాజధానికి పంపారు. ఉన్నది మాత్రం ఒక్కటే అంబులెన్స్‌. అదీ దశాబ్దకాలం నాటిది కావడంతో ఇంధన వినియోగం పెరుగుతోంది. రోగులు అందుకు సరిపడా ఛార్జీలు చెల్లిస్తేనే ముందుకు కదులుతోంది. నిరుపేదలు చేతిలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాకేంద్రంలో రెండు 108 వాహనాలు ఉన్నప్పటికీ అత్యవసర రోగులతో పాటు గ్రామాల నుంచి గర్భిణులను తరలించే నిమిత్తం వినియోగిస్తున్నారు.  

ప్రముఖుల పర్యటనలుంటే ఇక అంతే

జిల్లాలో ఎవరైనా ప్రముఖ నాయకుల పర్యటనలుంటే ప్రభుత్వ అంబులెన్సులు రోగులకు అందుబాటులోకి ఉండని పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లా ఆసుపత్రి, రెండు సీహెచ్‌సీల్లో ఉన్న వాటిని వారి సేవలకు  పంపిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ముందు జాగ్రత్త నిమిత్తం అంబులెన్సులను తరలించారు. ఇలాంటి సమయాల్లో రోగులకు ప్రైవేటు బండ్లే దిక్కవుతున్నాయి.


ఏళ్ల తరబడి మూలకు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని అత్యవసరంగా తరలించే నిమిత్తం ప్రభుత్వం రూ.60 లక్షల వ్యయంతో ఆసుపత్రిలోని ట్రామాకేర్‌ సెంటర్‌కు ప్రత్యేకంగా అంబులెన్సును సమకూర్చింది. పదేళ్ల క్రితం ఓ ఘటనలో అంబులెన్సు ఆలస్యం కారణంగానే రోగి మృతిచెందాడనే కారణంతో బాధిత కుటుంబీకులు సదరు వాహనాన్ని ధ్వంసం చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. నిరుపయోగంగా మూలనపడేశారు.


ఇవిగో ఉదాహరణలు

నిజామాబాద్‌కు ఆటోలో రోగి తరలింపు

భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన చిరుద్యోగి శ్వాస సంబంధ సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ అంబులెన్సు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ప్రైవేటు వాహనంలో తరలించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో నగలు తాకట్టుపెట్టాల్సి వచ్చింది.

* రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రున్ని తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. రోగి కుటుంబసభ్యులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రమాదమైనా గత్యంతరం లేక ఆటోలో తీసుకెళ్లారు.

* జిల్లాకేంద్రం శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లమన్నారు. ప్రైవేటు అంబులెన్సులోనే తరలించారు. ఒక్కో రోగి నుంచి రూ.8 వేలు వసూలు చేశారు. అత్యవసరం కావడంతో విధిలేని పరిస్థితిలో అడిగినంత ముట్టజెప్పారు. సాధారణంగా రూ.3 వేలలోపే తీసుకుంటారు.


మరో రెండు కావాలని కోరాం
- విజయలక్ష్మి, పర్యవేక్షకురాలు, వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రులు, కామారెడ్డి

జిల్లా ఆసుపత్రిలో ఒక్కటే అంబులెన్స్‌ ఉన్నప్పటికీ రోగులకు సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. త్వరలో ఇక్కడ వైద్య కళాశాల ప్రారంభించనున్నారు. పడకల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేక అంబులెన్సులు సమకూరుస్తుంది. జిల్లా ఆసుపత్రికి మరో రెండు వాహనాలు కావాలని వైద్యవిధాన పరిషత్‌కు ప్రతిపాదించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని