logo

టీకా వేయించారా?

కరోనా సృష్టించిన కల్లోలంతో ‘వ్యాధినిరోధక టీకా’ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. కొవిడ్‌ టీకాను పక్కనపెడితే పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు వారందరికీ వివిధ రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి.

Published : 26 Jul 2023 05:13 IST

క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే
ఆగస్టు 7 నుంచి మిషన్‌ ఇంద్రధనుష్
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

కరోనా సృష్టించిన కల్లోలంతో ‘వ్యాధినిరోధక టీకా’ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. కొవిడ్‌ టీకాను పక్కనపెడితే పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు వారందరికీ వివిధ రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. గర్భిణులు సైతం విధిగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే టీకాలు తీసుకోకుండా మిగిలిన వారికోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7 నుంచి అక్టోబరు 14 వరకు మూడు విడతల్లో టీకాలు ఇవ్వనున్నారు.

చిన్నారులు, గర్భిణులు వంద శాతం వ్యాక్సినేషన్‌ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం జిల్లాలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరుగుతున్నారు. అందరి వివరాలు సేకరిస్తున్నారు. 16 ఏళ్లలోపు వారికి ఎన్ని టీకాలు వేయించారు? గర్భిణులకు వ్యాక్సినేషన్‌ జరిగిందా? తదితర వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.

చిన్నారుల్లో బీసీజీ, హెచ్‌బీ, ఓపీవీ జీరో, ఓపీవీ 1-3, రోటా వైరస్‌, పెంటావాలెంట్‌, ఐపీవీ, విటమిన్‌ ఏ తదితర టీకాలు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు టీటీ-1, టీటీఏ-2, టీటీ బూస్టర్‌ టీకాలు తీసుకోవాలి. ఇదివరకు తీసుకోని 16 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు మిషన్‌ ఇంద్రధనుష్‌లో సిబ్బంది సూచన మేరకు వేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మూడు విడతలుగా..

* వాస్తవానికి ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రిల్లో వ్యాక్సినేషన్‌ నిరంతరం కొనసాగుతోంది. అయినప్పటికీ.. వివిధ కారణాలతో 5-8 శాతం మంది పలు రకాల టీకాలు తీసుకోవట్లేదని తేలింది. ఇలాంటి వారి కోసం మూడు విడతలుగా టీకాలు వేయనున్నారు.
* మొదటి విడతగా ఆగస్టు 7 నుంచి 12వ తేదీ వరకు, రెండో విడతలో సెప్టెంబరు 11 నుంచి 16, మూడో విడతలో అక్టోబరు 9 నుంచి 14 వరకు టీకాలు ఇవ్వనున్నారు.
* ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి తిరిగి ఇదివరకు తీసుకోని 16 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వనున్నారు.

యూ విన్‌ పోర్టల్‌లో నమోదు

మిషన్‌ ఇంద్రధనుష్‌లో భాగంగా వ్యాక్సినేషన్‌ చేయాల్సిన వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం(యూఐపీ) యూవిన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పుడు ఎవరికి టీకా ఇచ్చారు? తిరిగి మళ్లీ ఎప్పుడు వేయాలి? తదితర వివరాలు పూర్తిగా యాప్‌లో నిక్షిప్తం కానున్నాయి. టీకా పొందిన వారు విధిగా ధ్రువపత్రం పొందే వెసులుబాటు ఉండనుంది. ఇదే అంశంపై జీజీహెచ్‌లోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్‌సీ అధికారులు, సిబ్బంది శిక్షణకు హాజరయ్యారు.


ప్రజలంతా సహకరించాలి

- సుదర్శనం, జిల్లా వైద్యాధికారి, నిజామాబాద్‌

మిషన్‌ ఇంద్రధనుష్‌లో భాగంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తున్నారు. ప్రజలు పూర్తి వివరాలు తెలియజేయాలి. టీకాలు తీసుకోని వారిని గుర్తించి మూడు విడతల్లో వ్యాక్సినేషన్‌ చేస్తాం. ఇవి తప్పనిసరి. మా సిబ్బందికి సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని