logo

ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం

ఎండలు మండుతుండడంతో ఏప్రిల్‌, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు

Updated : 20 Apr 2024 06:52 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి నేరవిభాగం: ఎండలు మండుతుండడంతో ఏప్రిల్‌, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు. జిల్లాకేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌లలో అగ్నిమాపక కేంద్రాలుండగా.. గాంధారిలో అవుట్‌ పోస్టు మంటలు ఆర్పేందుకు పనిచేస్తోంది. వేసవి నేపథ్యంలో అగ్గి రాజుకుంటే.. తక్షణమే తప్పించుకునే వ్యూహాలపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తూ అధికారులు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

 కట్టడి ఎలా అంటే..

  •  ఫైర్‌ అలారమ్‌ ముఖ్యం: అగ్నిప్రమాదాలు సంభవించిన సమయాల్లో అప్రమత్తం చేసే ఫైర్‌ అలారమ్‌ విధానాన్ని ప్రతిచోట ఏర్పాటు చేయాలి. మంటలు అంటుకోగానే పొగ ఆధారంగా వేడిమికి అలారమ్‌ మోగుతుంది. దీంతో అప్రమత్తమై ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది.
  •  స్ప్రింక్లర్‌లు బిగించుకోవాలి: ఆసుపత్రులు, పాఠశాలలు, పరిశ్రమలు, షాపింగ్‌మాల్స్‌లో స్పింక్లర్‌లు బిగించుకోవాలి. మంటలు అంటుకొని పొగ రాగానే వేడికి స్పింక్లర్‌లు పగిలి  నీరు విరజిమ్ముతూ మంటలను ఆర్పుతాయి. అగ్నిమాపక పరికరాలు (ఫైర్‌ ఎక్స్‌టింగిషర్‌) అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. వీటితో మంటలను త్వరగా అదుపులోకి తీసుకురావచ్చు. హైడ్రెంట్స్‌ సైతం ఉపయోగపడతాయి. వీటికి చుట్టబడి ఉండే పైప్‌ ద్వారా నీటిని మంటలపైకి చల్లి ఆర్పే అవకాశముంటుంది.

ప్రాణాలు, ఆస్తి  కాపాడుకోవచ్చిలా..!

  •  గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు వస్తే.. వెంటనే గ్యాస్‌ సరఫరాను నిలిపి వేయాలి. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి వస్తున్న మంటకు వెనుక వైపు నుంచి ఓ తడివస్త్రాన్ని పట్టుకొని దానిపై కప్పి మంటను ఆర్పేయవచ్చు. గ్యాస్‌ సిలిండర్‌లు లీకైన సమయాల్లో అన్ని ద్వారాలు తెరిచి ఉంచాలి. విద్యుత్‌ పరికరాలను ఆన్‌-ఆఫ్‌ చేయకూడదు.  
  •  విద్యుదాఘాతం సంభవించినప్పుడు వెంటనే సరఫరాను నిలిపివేసే ప్రయత్నం చేయాలి. మంటలనార్పేందుకు నీటికి బదులు అగ్నిమాపక పరికరాలు వాడాలి. దీనివల్ల మంటలనార్పే వారికి విద్యుత్‌ షాక్‌ తగలకుండా ఉంటుంది.  
  •  పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమల్లో అత్యవసర ఫైర్‌ ఎగ్జిట్‌లు, ఫైర్‌ డోర్‌లు ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ ఉపకరణాల్లో స్పార్క్‌లు రాకుండా చూసుకోవాలి. వైరింగ్‌ వదులుగా ఉండకుండా ఓవర్‌లోడ్‌ పడకుండా జాగ్రత్త పడాలి.

ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
సయ్యద్‌ మహమూద్‌ అలీ, కామారెడ్డి అగ్నిమాపక కేంద్రం అధికారి

అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం నిర్మాణాలుంటే ప్రమాదాలు సంభవించినా మంటలను ఆర్పి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా కాపాడవచ్చు. ఏ ప్రమాదం సంభవిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రజల్లో చైతన్యం రావాలి. దీనిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని