logo

పుస్తకంతో దోస్తీ చేద్దామా..?

వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్‌ఫోన్‌ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు.

Published : 20 Apr 2024 06:55 IST

వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్‌ఫోన్‌ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. వారి ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతున్న చరవాణిని దూరంగా ఉంచడానికి పుస్తకం ఒక పరిష్కారం అంటారు విద్యావేత్తలు. సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయంటారు పూర్వీకులు.

ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో పుస్తక పఠనాన్ని పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరముంది. విరామ సమయాన్ని పుస్తకాలతో చెలిమికి ఉపయోగించాలి. చదవడంతో పిల్లల్లో దీర్ఘకాల, విస్తృత ప్రయోజనాలుంటాయి. సెలవుల్లో కనీసం ఒక పుస్తకమైనా పిల్లల చేత చదివించాలి. అందుకు వారిని గ్రంథాలయాలకు అలవాటు చేయాలి.

పఠనంతో ఒనగూరే నైపుణ్యాలు..

  •   మనసును ఉల్లాస పరిచే పుస్తకాలు చదివితే ఒత్తిడి మాయమవుతుంది.
  •  సామాజిక స్పృహ పెరుగుతుంది
  •  ఆహ్లాదకర పఠనానుభవం పొందే వారు ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఆలోచించి క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారం చూపించగలుగుతారు.   ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది.
  •  స్వీయ విశ్లేషణా సామర్థ్యం పెరిగి తప్పొప్పులను సరి చేసుకోగలుగుతారు.
  •  ఏ భాష పుస్తకాలు చదివితే ఆ భాషలోని పద సంపద తెలుస్తుంది. తద్వారా భాషపై మంచి పట్టు వస్తుంది. 2  సృజనాత్మకతంగా ఆలోచిస్తారు. 2  చర్చల్లో వాదనా నైపుణ్యం పెరుగుతుంది.
  • ఏకాగ్రత మెండుగా ఉంటుంది.
  • ఉన్నత వ్యక్తిత్వం అలవడుతుంది.

దిగ్గజాలే ఆదర్శం..

పుస్తకం హస్తభూషణం అంటారు. కానీ డిజిటల్‌ యుగంలో పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలంటే.. ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఆధారపడుతున్నారు. కానీ చేతిలో పుస్తకం పట్టుకుని చదువుతుంటే లభించే అనుభూతి వేరు. ఫోన్‌, ట్యాబ్‌ తెరలపై ఎంత చదివినా... తెరపై ఒక పేజీ కొంత భాగమే మనకు కనిపిస్తుంది. అదే పుస్తకంలో అయితే కళ్లెదుటే పూర్తి వాక్యాన్ని చదవొచ్చు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం అయిన బిల్‌గేట్స్‌ తన వెంట బ్యాగులో 10-15 పుస్తకాలు వెంట తీసుకెళ్లి గంటకు 150 పేజీలు చదువుతారట. మనకు అరచేతిలో స్మార్ట్‌ జీవితం తీసుకొచ్చిన కంపెనీ వ్యవస్థాపకులే పుస్తకం చేతబట్టుకుని చదువుతున్నారంటే దాంతో కలిగే ప్రయోజనం ఒక్కసారి ఊహించుకోండి.

ఆసక్తి నుంచి అలవాటుగా..

అప్పటి వరకు పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఇతర పొత్తాలు చదవమంటే సుముఖంగా ఉండరు. అందుకే వారికి ఇష్టమున్న అంశాలకు సంబంధించిన పొత్తం దించాలి. ఫలితంగా పఠనం ఆసక్తి నుంచి అలవాటుగా మారుతుంది. ప్రధానంగా విజయగాథలు, ఆత్మకథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివించాలి. విద్యార్థి స్థాయిని బట్టి వారికి చిత్రాలతో వివరణలు ఉండే పుస్తకాలు సమకూర్చాలి.

పదేళ్ల నుంచే..

పసిప్రాయంలో ఉన్న అలవాట్లు పెరిగే కొద్దీ బలపడుతాయి. అందుకే పిల్లలకు 10 ఏళ్ల వయసులోనే పఠనం అలవాటు చేయాలి. ఈ తరం పిల్లలు పఠనమంటే పాఠ్య పుస్తకాలు చదవడం అనుకుంటారు. కానీ జీవితానికి అక్కరకొచ్చే విజ్ఞానం, వివేకం, విశ్లేషణాశక్తిని కలిగించే పుస్తకాలు చదవాలి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని