logo

ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం

పార్లమెంటు ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు

Published : 23 Apr 2024 07:23 IST

 ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

 

పార్లమెంటు ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. పోలింగ్‌కు 20 రోజుల సమయమే ఉండడంతో ఎలాగైనా ప్రతి ఓటరును చేరేలా ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ తాము ఏం చేస్తామో చెప్పుకొంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే పోటీ పార్టీలు, అభ్యర్థులపై వైఫల్యాలు వెలికితీస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇవే కాకుండా ప్రజలకు దగ్గరయ్యే అన్ని మార్గాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సైతం చురుగ్గా ఉంటూ ప్రత్యర్థుల విమర్శలపై ఎదురుదాడికి దిగుతున్నారు.

సామాజిక మాధ్యమాలతో  చేరువగా..

చరవాణి ప్రతి ఒక్కరికీ చేరువకావడంతో అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి తమ ప్రసంగాలు అందరికి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నియోజకవర్గ, మండలాల వారీగా సోషల్‌ మీడియా కన్వీనర్లను నియమించుకుంటున్నారు. వారికి అవసరమైన సాంకేతిక గ్యాడ్జెట్లు, టెక్నాలజీని అందుబాటులో ఉంచుతున్నారు. వారి నాయకుడికి సంబంధించిన ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తిచూపుతున్నారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే వాటిని వీడియోలు, మీమ్స్‌ రూపంలో అందరికీ చేరేలా విరివిగా పోస్టులు పెడుతున్నారు.

ఫ్లెక్సీలు, జెండాలకు  ఆర్డర్లు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఫ్లెక్సీలు, జెండాలను విరివిగా ఉపయోగించాలని నిర్ణయించారు. నెల రోజుల ముందుగానే ఆర్డర్లు ఇచ్చి ఎన్నికల సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వాటిని ఏర్పాటు చేయడానికి కూలీలను సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థి ప్రచారానికి ఒక రోజు ముందే ఏర్పాటు చేసేలా ఇప్పటికీ ఆయా చోట్లకు చేరవేస్తున్నారు.

వాహనాల ముందస్తు  బుకింగ్‌లు..

ఎన్నికల ప్రచారంలో వాహనాల పాత్ర కీలకం. గ్రామాల్లో పర్యటించడానికి కార్యాచరణ రూపొందించి పార్టీ నాయకుల వాహనాలకు అదనంగా ఇతర వాటిని అద్దెకు తీసుకుంటున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నాయకులతోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేక ప్రచార రథాలు తయారు చేయిస్తున్నారు. అందులో సౌండ్‌ సిస్టం ఉండేలా.. పార్టీ, అభ్యర్థికి సంబంధించిన పాటలు రూపొందించి నిత్యం ప్రజల్లో తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

జనం  కనిపించేలా..

ప్రచారం సమయంలో ఎక్కువ సంఖ్యలో జనం కనిపించేలా కార్యకర్తల్లో జోష్‌ నింపేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా రోజుకు రూ.500 వరకు ఇస్తూ ఒక పూట భోజనం పెడితే ఎంత ఖర్చవుతుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేసేలా చూడాలని ద్వితీయ శ్రేణి నాయకులకు సూచిస్తున్నారు. అంతేగాక కళాకారులతో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తూ పార్టీల పథకాలు, హామీలను ప్రజలకు దగ్గరయ్యేలా చూడాలని ఏర్పాట్లు చేశారు.

సర్పంచి.. ఎంపీ.. ఎమ్మెల్యే

జిల్లాకు చెందిన కేశ్‌పల్లి గంగారెడ్డి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామానికి చెందిన ఆయన మొదట సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సర్పంచి తర్వాత నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. తెదేపా నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత జరిగిన పరిణామాలతో తెరాస(ఇప్పటి భారాస)లో చేరిన ఆయన డిచ్‌పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక వ్యక్తి సర్పంచి, ఎంపీ, ఎమ్మెల్యే ఇలా మూడు పదవుల్లో కొనసాగడం అరుదుగా చూస్తుంటాం. ఆయన పేరు గడ్డం గంగారెడ్డి అయినా.. కేశ్‌పల్లి గంగారెడ్డిగానే జిల్లా వాసులకు సుపరిచితులు.  మరణించినా.. ఆయన చేసిన సేవలు ప్రజలు  ఇప్పటకీ గుర్తుంచుకుంటారు.
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌


కొనసాగుతున్న నామినేషన్లు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం 12 నామపత్రాలు దాఖలయ్యాయి. భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ తరఫున ఆయన సతీమణి వినోద, కొడుకు అజయ్‌ మూడో సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ తరఫున పార్టీ నాయకులు రెండో సెట్‌ వేశారు. ఎన్‌సీపీ అభ్యర్థిగా విఠల్‌ మలావత్‌, స్వతంత్ర అభ్యర్థిగా ప్రశాంత్‌, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్‌ నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి సయ్యద్‌ అస్గర్‌ రెండో సెట్‌, దేవతి శ్రీనివాస్‌(బహుజన్‌ ముక్తి పార్టీ), యుగంధర్‌(అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ పార్టీ), పోతు అశోక్‌(మన తెలంగాణ రాష్ట్ర సమైఖ్య పార్టీ), కండెల సుమన్‌(ధర్మ సమాజ్‌ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు ఆర్‌.రాజేందర్‌, రాపెల్లి శ్రీనివాస్‌ రెండో సెట్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని