logo

కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు

నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది.

Published : 24 Apr 2024 05:53 IST

ఈనాడు, కామారెడ్డి: నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు గ్రామాలు, వార్డుల్లో ప్రచారం చేయడం కష్టంతో కూడుకున్న పని. దీంతో వారు తమ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నేతలపైనే ప్రచార బాధ్యతలు మోపుతున్నారు.

సమస్యలపై నిలదీత

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అనంతరం జాతీయస్థాయి అంశాలే ప్రచార అస్త్రాలుగా ఉన్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రజలు నాయకులను అడుగుతున్నారు. ఇటీవల బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్‌ మండలంలో స్థానిక సమస్యలు పరిష్కరించేవారికే తమ ఓటు అంటూ బ్యానర్‌ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో తెలుపుతూ స్పష్టమైన హామీనివ్వాలని ప్రచారానికి వచ్చిన నేతలను కోరుతున్నారు.

గతానికి భిన్నంగా..

గతంలో అభ్యర్థులు మండల, నియోజకవర్గ, జిల్లాకేంద్రాల్లో ప్రచార కార్యాలయాలను తెరిచి కార్యకర్తలు, ముఖ్యనేతలతో పల్లెలు, పట్టణాల్లో ఇంటింటి ప్రచారం చేపడుతుండేవారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భిన్నంగా రాజకీయ పార్టీల ప్రచారం సాగుతోంది. కేవలం మండల, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలతోనే సరిపెడుతున్నారు. రథాలతో పల్లెలు, మండల కేంద్రాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ ముఖ్యనేతలతోనే సమావేశం నిర్వహిస్తూ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలపైనే ప్రచార బాధ్యతలు వేస్తున్నారు.

మొదటిసారి త్రిముఖ పోరు

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు ఎన్నికలు జరగగా.. ఇందులో ద్విముఖ పోరు కొనసాగింది. 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్‌, భారాస, భాజపా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు ఏ పార్టీకి మద్దతు తెలపనున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలను ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ లోకసభలో తమ సభ్యులు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరాన్ని భారాస నేతలు నొక్కిచెబుతున్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించాలని భాజపా కోరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని