logo

ఆగని గంజాయి రవాణా

జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

Updated : 29 Apr 2024 05:45 IST

అధికారులను ఏమారుస్తూ విచ్చలవిడిగా దందా 

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక రైళ్లు, ఇతర వాహనాల్లో గంజాయి రవాణా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక రైళ్లలో ఎండుగంజాయిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. కార్లు, టాటాసుమోలు, ఇతర వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల నుంచి జిల్లాకు గంజాయి చేరుకుంటోంది.

ఎన్నికల వేళ మినహా మిగతా సమయాల్లో వాహనాల తనిఖీ నామమాత్రంగా ఉండడంతో అంతర్‌ రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టులను సైతం సులువుగా దాటి గంజాయిని తీసుకొస్తున్నారు. కామారెడ్డి జిల్లా సరిహద్దు మండలంలోని ఓ గ్రామంలో గంజాయి అక్రమ దందా కోసం కొందరు ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నా అధికారులు తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరు వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాకు మాత్రమే వినియోగిస్తున్నారన్న విమర్శలున్నాయి. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఆబ్కారీ, పోలీసు, రెవెన్యూ, రవాణా, వ్యవసాయ, రైల్వే శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.

‘కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులో రాత్రి పూట కొందరు యువకులు ద్రవ రూపంలో ఉన్న గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి మూలాలను తొలగించేందుకు పోలీసులు అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చింతపల్లికి వెళ్లి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించారు.’

కామారెడ్డి జిల్లాకేంద్రంలో ముగ్గురు యువకులు ఎండు గంజాయిని పొట్లాల్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి వినియోగదారులకు సంబంధించిన చరవాణి నంబర్లను ఆరా తీస్తే వారిలో మెజారిటీ విద్యార్థులుండడంతో అవాక్కయ్యారు. గంజాయి వినియోగిస్తున్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  తాజాగా ఈ నెల 26న కామారెడ్డి జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్న టీ స్టాల్‌లో ఏడు ఎండు గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. వీటిని నిజామాబాద్‌ జిల్లాకేంద్రానికి చెందిన మహిళ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి సరఫరా అవుతున్నట్లు కామారెడ్డి ఆబ్కారీ శాఖ అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.


సమన్వయంతోనే కట్టడి సాధ్యం

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడి సాధ్యమవుతుంది. ఇప్పటికే గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశాం. దీనికోసం పోలీసులు, రవాణా, రైల్వే, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం అవసరమవుతోంది. అందరూ సహకరిస్తేనే కట్టడి చేయవచ్చు.

రవీందర్‌రాజ్‌, కామారెడ్డి జిల్లా ఆబ్కారీశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని