logo

సార్వత్రిక సమరం.. యువోత్సాహం

ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా పొందవచ్చు. ఎన్నికల్లో నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు. చట్టసభలకు పంపవచ్చు. సమర్థ పాలనకు పట్టం కట్టవచ్చు. ఈ విషయమై యువతీయువకుల్లో చైతన్యం పెరిగింది.

Updated : 06 May 2024 06:06 IST

న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి, ఆర్మూర్‌ పట్టణం

ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా పొందవచ్చు. ఎన్నికల్లో నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు. చట్టసభలకు పంపవచ్చు. సమర్థ పాలనకు పట్టం కట్టవచ్చు. ఈ విషయమై యువతీయువకుల్లో చైతన్యం పెరిగింది. దేశపౌరులుగా తమ హక్కును పొందాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి వజ్రాయుధాన్ని పొందారు. ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటు వేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించగా.. ఉత్సాహంగా స్పందించారు. ఓటు హక్కు పొందడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50,963 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. వీరంతా ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఓటర్లు 17,04,867 మంది ఉన్నారు. ఇందులో 18-19 ఏళ్ల వారు 50,963 మంది ఉన్నారు.


ఓటును అమ్ముకోను

- అజయ్‌, కమ్మర్‌పల్లి

నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఇంతకు ముందు ఎన్నికల్లో ఓటు గురించి అందరూ మాట్లాడుకుంటే నాకు ఎప్పుడు వస్తుందోనని ఆలోచించేవాడిని. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఆయుధం ఓటు. నా హక్కును అమ్ముకోను. నేను ఓటేస్తా.. మిగతా వారితో ఓటేయిస్తా.


వజ్రాయుధంగా మలుచుకుంటా

- శ్రీవైభవ్‌, కమ్మర్‌పల్లి

ఓటేసే అవకాశం రావడంతో ఆనందంగా ఉంది. మంచి వారికి ఓటేస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. లేకపోతే సమాజాన్ని పతనం చేసేవారే పాలకులవుతారు. ఉత్తమ గుణాలున్న వ్యక్తిని ఎన్నుకోవడం ముఖ్యం. నాకు వచ్చిన అవకాశాన్ని వజ్రాయుధంగా మలుచుకుంటా.


ఉపాధి కల్పించేవారికే నా మద్దతు

- లలిత్‌ చంద్ర, పెర్కిట్‌

యువత ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్‌ ముందుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటును వృథా చేయకూడదు. అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. కొన్ని మాత్రమే మాట మీద నిలబడుతున్నాయి. నా తొలి ఓటును యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే వారికే వేస్తాను.


మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేవారికే

- శ్రీవర్షిణి, ఆర్మూర్‌

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు రాజకీయాల్లోనూ ముందుండాలి. మహిళలకు ఆయా రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలి. దేశ భద్రతతో పాటు, మహిళ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి వారికే నా ఓటు వినియోగించుకుంటాను.


రైతన్నలకు అండగా ఉండేవారికే

- అజయ్‌, మామిడిపల్లి

దేశానికి వెన్నెముక రైతులు. అలాంటి రైతన్నలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు, నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొంత జాప్యం చేస్తున్నారు. ఇలా కాకుండా రైతులను ఆదుకొని ఇబ్బందులు తొలగించాలి. పంటలకు సరైన మద్దతు ధరలు ఇవ్వాలి. రైతుల కోసం పనిచేసే నాయకులకు ఓటేస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని