logo

ఎవరి ధీమా వారిదే..!

పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాజకీయ పార్టీల నేతలు బూత్‌స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్ల చెంతకు వెళ్తున్నారు. లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కామారెడ్డిపై భారాస, కాంగ్రెస్‌, భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం సాగిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Published : 06 May 2024 04:43 IST

కామారెడ్డిలో సత్తాచాటేందుకు మూడు పార్టీల ప్రయత్నాలు
ఈనాడు, కామారెడ్డి

పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాజకీయ పార్టీల నేతలు బూత్‌స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్ల చెంతకు వెళ్తున్నారు. లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కామారెడ్డిపై భారాస, కాంగ్రెస్‌, భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం సాగిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముగ్గురు నేతలకు ప్రతిష్ఠాత్మకం

లోక్‌సభ ఎన్నికలు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన షబ్బీర్‌ అలీ, వెంకటరమణారెడ్డి, గంప గోవర్ధన్‌లకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వీరి కేంద్రంగానే నియోజకవర్గంలో ఎన్నికల పోరు సాగుతోంది. ఈ ముగ్గురు నేతలు కార్యకర్తల సమావేశాల వరకే పరిమితమైనప్పటికీ ప్రచార వ్యూహాలను నిర్దేశిస్తున్నారు.

మెజారిటీపై దృష్టి

చేరికలతో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యామని భావిస్తున్న కాంగ్రెస్‌ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవతో అసెంబ్లీకి మించి ఓట్లు సాధిస్తామనే నమ్మకంతో భాజపా నేతలున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగుచెందారని భావిస్తున్న భారాస నేతలు పూర్వవైభవం వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇలా మూడు పార్టీల నేతలు ఎవరికి వారే మెజారిటీ ఓట్ల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.


చేరికలతో కాంగ్రెస్‌.. పట్టు కోసం భాజపా, భారాస

అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోటీచేసి ఓటమి చెందగా భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటాలనే ఉద్దేశంతో హస్తం నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఇతర పార్టీల నేతల చేరికలను ప్రోత్సహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌కు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించాలనే సంకల్పంతో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ వ్యూహాలను రచిస్తున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం తన పట్టు నిలుపుకొనేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తూనే.. నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారాస ఎన్నికల ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు బాధ్యతలు అప్పగించి అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్లను తిరిగి సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల భారాసకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం కొంత మేర ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రచారం చేపడుతోంది. ఈ నెల 7న జిల్లాకేంద్రంలో భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌షోమీదనే పార్టీ ఆశలు పెట్టుకుంది. ఉద్యమం నాటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నియోజకవర్గంలో తమ పట్టు చేజారకుండా ఉండేందుకు పార్టీ అగ్రనేతలు దృష్టి సారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని