logo

ఎన్నికల ప్రక్రియలో వీరే కీలకం

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది.

Published : 08 May 2024 07:00 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకొని పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమ బాగా శ్రమించాల్సి ఉంటుంది. బీఎల్వో నుంచి రిటర్నింగ్‌ అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్నికల క్రతువు సజావుగా ముగుస్తుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పనులు చివరి దశకు చేరాయి. అధికారులు, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.

 ఏఆర్వోలు

 ప్రతి నియోజకవర్గానికి ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారి(ఏఆర్‌వో) ఉంటారు. వీరిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వారి పరిధిలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఓటరు జాబితా సరి చేయడం, ఓటర్ల చీటీల పంపిణీ పర్యవేక్షణ, పోలింగ్‌ శాతం పెంచేందుకు కార్యక్రమాల నిర్వహణపై ప్రధాన దృష్టి సారిస్తారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి వచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేస్తారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామగ్రి తరలింపు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈవీఎంల భద్రతను పర్యవేక్షణ చేస్తారు. పోలింగ్‌ సరళని ఎప్పటికప్పుడు ఆర్వోకు తెలియజేస్తారు.

 సెక్టోరియల్‌ అధికారి

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించే బాధ్యత సెక్టోరియల్‌ అధికారిపై ఉంటుంది. ర్యాంపుల ఏర్పాటు, విద్యుత్తు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా చూస్తారు. ఒక్కో సెక్టోరియల్‌ అధికారికి పది చొప్పున పోలింగ్‌ కేంద్రాలుంటాయి. పోలింగ్‌ కేంద్రంతో పాటు పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి. పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ శాతాన్ని పైస్థాయి అధికారికి చేరవేస్తారు.

 పీవోలు

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొస్తారు. ఆ కేంద్రం పూర్తి బాధ్యత ఆయనదే. ఓటింగ్‌ ముగిసిన తర్వాత యంత్రాలను బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూంనకు తరలిస్తారు. వీరికి సహాయంగా అదనపు ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. వీరితో పాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులు ఉంటారు. ఎన్నికల సంఘం నియమనిబంధలకు లోబడి వారు పని చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ ప్రారంభ సమయానికి ముందే ఈవీఎంలు పని చేస్తున్నాయో లేదో పీవో చూడాల్సి ఉంటుంది.

 బీఎల్వోలు..

గ్రామ, నగరం, పట్టణ స్థాయిలో పనిచేసే వారే బీఎల్‌వో(బూత్‌ స్థాయి అధికారి)లు. అర్హులైన వారందరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు కొత్త వారి పేర్లు నమోదు చేయిస్తారు. ఇంటింటికి తిరిగి పోల్‌ చీటీలు అందిస్తారు. పోలింగ్‌ శాతం పెరిగేందుకు కరపత్రాలు, ఓటరు గైడ్‌ వంటివి పంపిణీ చేస్తారు. పోలింగ్‌ రోజు వారికి కేటాయించిన కేంద్రం వద్ద ఓటరు జాబితాతో కూర్చుంటారు. ఎవరికైనా పోల్‌ చీటీ రాకుంటే వెంటనే అక్కడే అందజేస్తారు.

సూక్ష్మ పరిశీలకులు

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులు(మైక్రో అబ్జర్వర్‌) ఉంటారు. పోలింగ్‌ రోజు ఉదయం ఈవీఎం పనితీరును పర్యవేక్షిస్తారు. పోలింగ్‌ను పర్యవేక్షిస్తారు. ఓటింగ్‌కు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా చూస్తారు. ఇప్పటికే వీరికి శిక్షణ పూర్తయింది.

రిటర్నింగ్‌ అధికారి

పార్లమెంటు ఎన్నికకు జిల్లా కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. నోటిఫికేషన్‌ విడుదల మొదలుకొని నామ పత్రాల స్వీకరణ, అధికారులకు విధుల కేటాయింపు, వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. ఈవీఎంల తరలింపు, కేటాయింపు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశాలు తదితర పనులు  చూస్తారు. నిత్యం సమావేశాల ద్వారా అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు. ఓటరు జాబితా తయారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఆయనదే బాధ్యత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని