logo

అమలుకాని చలువ పైకప్పు విధానం

ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇ

Published : 10 May 2024 02:50 IST

నగర, పురపాలికల్లో వేడెక్కుతున్న భవనాలు
కామారెడ్డి పట్టణం-న్యూస్‌టుడే

ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే జిల్లాలో 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండాలి. కాని 38 డిగ్రీలకు చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చలువ పైకప్పు విధానాన్ని గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఇళ్లలో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు స్లాబ్‌పై తెల్లని పెయింట్‌ వేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఎక్కడా సక్రమంగా అమలుకావడం లేదు.

నివాసయోగ్య భవనాలకు తప్పనిసరి

ప్రతి పురపాలికకు 6 లక్షల చదరపు అడుగుల మేర పెయింట్‌ వేసేలా లక్ష్యం నిర్దేశించారు. 600 చదరపు గజాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన నివాసయోగ్య భవనాలకు చలువ విధానం తప్పనిసరి చేసింది. అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు, భారీ భవంతులు దీని పరిధిలోకి వస్తాయి. కోరిన వారందరికీ నిర్ణీత రుసుం స్వీకరించి ప్రక్రియను అమలు చేయాలి. సర్కారు భవనాలు, వాణిజ్య సముదాయాలకు తప్పనిసరి చలువు విధానం వర్తింపజేయాలి.

చల్లగా మార్చే ప్రక్రియ

భారీ భవనాలను సిమెంట్‌ కాంక్రీట్‌తో నిర్మించడంతో పై కప్పులు ఎండకు వేడెక్కుతాయి. చలువ పై కప్పు విధానంలో సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా పైకప్పునకు ప్రత్యేక పూత పూస్తారు. ఇందులో  మూడు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో లైమ్‌వాష్‌/పాలిమర్‌/ప్లాస్టిక్‌ సాంకేతికతను వినియోగిస్తారు. రెండో పద్ధతిలో పాలివినీల్‌ క్లోరైడ్‌ ఆధారంగా పైకప్పును తీర్చిదిద్దుతారు. మూడో పద్ధతిలో ఆల్బిడో, సిరామిక్‌ మొజాయిక్‌ టైల్స్‌ను పైకప్పులో అమరుస్తారు. మూడింటిలో ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు. పై కప్పులో వినియోగించే సామగ్రి వేడిని తగ్గిస్తాయి. సాధారణ ఇళ్లతో పోలిస్తే చలువ పై కప్పు ఉన్న నిర్మాణాలు 80 శాతం వేడి ప్రభావం లేకుండా చేస్తాయి. సర్కారు ఆమోదించిన ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు ఈ పనులను నిర్వహిస్తాయి. చలువ పై కప్పు విధానంపై ప్రజల్లో అవగాహన రావాల్సి ఉందని కామారెడ్డి పట్టణ ప్రణాళిక విభాగాధికారి గిరిధర్‌ న్యూస్‌టుడేతో అన్నారు. ఈ విషయమై మరింత చైతన్యం కలిగించేందుకు చర్యలు చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని